What is Sengol?: పార్లమెంట్ కొత్త భవనంలోకి చేరబోతున్న ఈ ‘రాజ దండం’ ప్రత్యేకత ఏంటి?-what is sengol tamil nadus historic sceptre finds new home in parliament ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  What Is Sengol?: పార్లమెంట్ కొత్త భవనంలోకి చేరబోతున్న ఈ ‘రాజ దండం’ ప్రత్యేకత ఏంటి?

What is Sengol?: పార్లమెంట్ కొత్త భవనంలోకి చేరబోతున్న ఈ ‘రాజ దండం’ ప్రత్యేకత ఏంటి?

HT Telugu Desk HT Telugu
May 24, 2023 02:34 PM IST

What is Sengol?: తమిళ రాచరిక సంస్కృతిలో భాగమైన ‘సెంగోల్ (Sengol)’ లేదా ‘రాజ దండం’ నూతన పార్లమెంటు భవనంలోకి చేరబోతోంది. లోక్ సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో ఈ రాజదండాన్ని ప్రత్యేకంగా అమర్చనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు; పైన లోక్ సభలో ప్రతిష్టించబోతున్న రాజదండం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు; పైన లోక్ సభలో ప్రతిష్టించబోతున్న రాజదండం

PM Modi to inaugerate : మే 28వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని (New parliament building) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవనంలోని లోక్ సభ జరిగే హాల్ లో స్పీకర్ స్థానానికి సమీపంలో ఒక రాజదండాన్ని (Sengol) ఏర్పాటు చేయనున్నారు. ఈ రాజదండానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. తమిళ రాజరిక సంస్కృతితో, ముఖ్యంగా చోళుల కాలంలో ఇది విడదీయలేని భాగం. ముఖ్యంగా ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగే సమయంలో ఈ బంగారు రాజదండాన్ని కొత్తగా రాజుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తికి అందజేస్తారు. 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ వారి నుంచి పాలన బాధ్యతలను స్వీకరిస్తున్న సమయంలో కూడా.. రాజ్య పాలన బదిలీకి ప్రతీకగా ఈ రాజదండాన్ని నెహ్రూ అందుకున్నారు.

What is Sengol?: ఐదు అడుగుల పొడవైన రాజదండం

మే 28న నూతన పార్లమెంటు భవన (New parliament building) ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలోని స్పీకర్ స్థానం సమీపంలో ఈ బంగారు ‘సెంగోల్ (Sengol)’ లేదా ‘రాజ దండం’ ను అమరుస్తారు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. బంగారంతో చేసిన ఈ రాజదండం (Sengol) ఐదు అడుగుల పొడవుతో ఉంటుంది. పై భాగంలో కూర్చున్న భంగిమలో నంది ఉంటుంది.

Lord Mountbatten to Nehru?: మౌంట్ బాటన్ నుంచి నెహ్రూకు..

ఈ రాజదండానికి భారత స్వాతంత్య్రోద్యమంతో అవినాభావ సంబంధం ఉంది. భారత్ స్వాతంత్య్రం పొందిన సమయంలో.. భారత్ కు స్వాతంత్య్రాన్ని, పాలన బాధ్యతలను అప్పగించడానికి ప్రతీకగా ఏం చేయాలని నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ జవహర్ లాల్ నెహ్రూ ని అడిగారు. ఏం చేయాలో పాలుపోని నెహ్రూ.. ఈ సమస్యను సహచర నేత సీ రాజగోపాలా చారి ముందు పెట్టారు. బ్రిటన్ నుంచి భారత్ కు అధికార మార్పిడిని సూచించే సంకేతంగా ఏం చేస్తే బావుంటుందని ఆలోచించిన రాజగోపాలా చారికి.. తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్ లేదా రాజదండం గుర్తుకు వచ్చింది. చోళుల కాలం లో అధికార మార్పిడికి చిహ్నంగా ఈ రాజదండాన్ని కొత్త రాజుకు అందించేవారన్న విషయం గుర్తుకు రావడంతో, ఆయన నేరుగా మద్రాసు (చెన్నై) కు వెళ్లారు. అక్కడి సంప్రదాయ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరువదుతురై ఆశ్రమానికి వెళ్లారు. ఆ మఠాధిపతి, ఆధ్యాత్మిక గురువును సందర్శించి ఈ సమస్యను ఆయనకు విన్నవించారు. దాంతో, ఆ గురువు సెంగోల్ లేదా రాజదండాన్ని తయారు చేసే బాధ్యతను వుమ్మిడి బంగారు చెట్టి అనే ప్రఖ్యాత నగల వర్తకుడికి అప్పగించారు. వుమ్మిడి బంగారు చెట్టి ఐదడుగుల పొడవుతో, పైన నందితో అద్భుతమైన రాజదండాన్ని రూపొందించి, రాజగోపాలాచారికి అందించారు. ఆ రాజదండాన్ని లార్డ్ మౌంట్ బాటన్ కు ఇచ్చి, ఆ తరువాత అతడి నుంచి ఆ రాజదండాన్ని తీసుకుని గంగాజలంతో అభిషేకించి, స్వాతంత్య్రం పొందడానికి సరిగ్గా 15 నిమిషాల ముందు జవహర్ లాల్ నెహ్రూకి అందించారు. అదే రాజదండాన్ని ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించనున్నారు.