AP Mega City : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మెగా సిటీకి ప్రభుత్వం ప్లాన్.. ఆకాశమే హద్దుగా భూములకు ధరలు!
AP Mega City : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే కీలక ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. వాటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెగా సిటీని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమరావతిపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మెగా సిటీని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. 4 కీలక నగరాలతో మెగా సిటీని అభివృద్ధి చేయనుంది. "విజయవాడ, మంగళగిరి, అమరావతి, గుంటూరు" నగరాలను విలీనం చేయాలని యోచిస్తోంది. ఇదే జరిగితే.. ఈ నగరాల చుట్టూ ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరగనున్నాయి.
ఆర్థిక అవృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించేందుకు.. రియల్ ఎస్టేట్ రంగంలో సడలింపులు ఇచ్చే యోచనలో ఉంది. ముఖ్యంగా లేఅవుట్ అనుమతుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ 4 నగరాలను విలీనం చేస్తే.. ఇప్పటికే ఉన్న మౌళిక వసతులను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
గుంటూరు, విజయవాడ మధ్య ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరిగాయి. ఈ నగరాలతో అమరావతి, మంగళగిరికి అనుసంధానం చేస్తే.. రియల్ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెగా సిటీకి అడుగులు పడితే.. ఇప్పుడు మంజూరు అయిన ప్రాజెక్టులతో మెట్రో నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. దీంతో పరిశ్రమలకు సులువుగా కేటాయించే అవకాశం ఉంది.
ఇప్పటికే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు.. ఫైనల్ ఎలైన్‌మెంట్, డీపీఆర్, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు కోసం అడుగులు పడినా.. 2019లో ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది.
2024లో చంద్రబాబు సీఎం అయ్యాక.. మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. కేంద్రం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ కోసం అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ.. ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు లేఖలు రాశారు. మెగా సిటీకి అడుగులు పడితే.. ఈ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందూలూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.