CM Chandrababu : చేయని తప్పునకు 53 రోజుల జైలు శిక్ష, సోషల్ మీడియాలో సొంత తల్లిపై బూతులు-సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించారని సీఎం చంద్రబాబు అన్నారు. చేయని తప్పునకు తాను శిక్ష అనుభవించానన్నారు. సోషల్ మీడియాలో సొంత తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్నారన్నారు.
దిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో తన అరెస్టు, సోషల్ మీడియా, ఎన్డీఏ పాలన, ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు పాటు వైసీపీ ప్రభుత్వం తనను వేధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. చేయని తప్పునకు, శిక్ష అనుభవించానన్నారు. తాను 45 ఏళ్ల పాటు ఎన్నో ప్రజా ప్రయోజన పాలసీలు తీసుకొచ్చి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి, ప్రజల కోసమే పని చేశానన్నారు. అలాంటి తనను ఇలా అక్రమ కేసుల్లో ఇరికించి వేధించారన్నారు. కానీ ఆ 53 రోజులు ఎక్కడా తాను డీమోరలైజ్ అవ్వలేదన్నారు. మరింత పట్టుదల పెరిగిందన్నారు. ఆ పట్టుదల ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీ నంబర్ వన్
"ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా ఉండాలనేది మా లక్ష్యం. అందుకు ఈ పది సూత్రాలతో ముందుకు వెళ్తున్నాం. పేదరిక నిర్మూలనకు, దేశాభివృద్ధికి ఈ పది సూత్రాలు ఉపయోగపడతాయి. పీపీపీ విధానాలు, ఉపాధి, ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, నదుల అనుసంధానం, అగ్రికల్చర్, లాజిస్టిక్స్ , గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ భారత్, డీప్ టెక్నాలజీ దేశాభివృద్ధిలో భాగం కావాలి. మన దేశంలో జనాభా తగ్గుదల గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. పాపులేషన్ మ్యానేజ్మెంట్ ద్వారా, మన దేశం ముందుకు వెళ్లాలి. దీనిపై చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి మాత్రమే ధ్యేయం. అందరం ఒకరిని ఒకరం గౌరవించుకుని, మాట్లాడుకుని, ప్రజల కోసం పని చేస్తాం"- సీఎం చంద్రబాబు
కూటమి కనీవినీ ఎరుగని విజయం
కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే అభివృద్ధి మరింత వేగంగా చేసే వీలు ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో పాటుగా, ప్రజలను కూడా భాగస్వామ్యులని చేసేలా, ఈసారి కూటమి పరిపాలన ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో పాటు, ఎన్డీఏ కూటమిపై ప్రజలకు స్పష్టమైన భరోసా కలిగిందన్నారు. అందుకే కూటమికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 57% ఓటింగ్ తో పాటు, 93% సీట్లు వచ్చాయన్నారు.
"సోషల్ మీడియాలో మమ్మల్ని మాత్రమే కాదు, సొంత తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తుంటే, వాళ్లని ఏమనాలి? ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా? సోషల్ మీడియాలో మహిళలని వేధించే వారిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని పై చర్చ జరగాలి"- సీఎం చంద్రబాబు
మోదీకి సంపూర్ణ సహకారం
ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, తమ సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశం చాలా గొప్పది, ఈ దేశం కోసం, అందరం కలిసి పనిచేస్తామన్నారు. తమ అభిప్రాయాలు చెప్తూ, ప్రధాని మోదీ నాయకత్వంలో, దేశ అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీ, దేశ రాజీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. దేశ అభివృద్ధి కోసం టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.