InnerRingRoad Case: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సిఐడి చార్జిషీట్.. ఏ1గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు-ap cid charge sheet in inner ring road case tdp president chandrababu as a1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Innerringroad Case: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సిఐడి చార్జిషీట్.. ఏ1గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

InnerRingRoad Case: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సిఐడి చార్జిషీట్.. ఏ1గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Feb 09, 2024 09:33 AM IST

InnerRingRoad Case: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో ఏపీ సిఐడి ఛార్జిషీటు దాఖలు చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ,లోకేష్‌లను నిందితులుగా పేర్కొన్నారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై అభియోగాల నమోదు
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై అభియోగాల నమోదు

InnerRingRoad Case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై నమోదైన కేసులో సిఐడి ఛార్జిషీటు దాఖలు చేసింది.ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా పొంగూరి నారాయణలను పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేశారు.

క్విడ్‌ ప్రో వ్యవహారంలో ప్రముఖుల భూముల విలువ పెరిగేలా ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పులు చేశారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది. అలైన్‌మెంట్‌ జరిగిన సమయంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా ఉన్న నారా లోకేశ్‌ను ఏ-14గా, లింగమనేని రమేశ్‌ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. నిందితులపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఛార్జిషీటు దాఖలు చేయడంతో ఈ కేసులో న్యాయవిచారణ కొనసాగనుంది. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా ఉందని సిఐడి ఆరోపిస్తోంది. అలైన్‌మెంట్‌ మార్పుతో లింగమనేని రమేష్‌ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు చేరిందని సిఐడి అభియోగాల్లో పేర్కొంది. రాజధాని నిర్మాణం పూర్తయ్యాక వీటి విలువ రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని ఛార్జిషీట్‌లో ఆరోపించారు.

సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీ ముసుగులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ పేరుతో భూముల విలువ పెరిగేలా కుట్ర పూరితంగా వ్యవహరించారని ఛార్జిసీట్‌లో పేర్కొన్నారు.

అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కోసం సీఆర్‌డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఆ ప్లాన్‌ ప్రకారం పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించాల్సి ఉన్నా చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్ తదితరులకు లబ్ది చేకూర్చేలా అలైన్‌మెంట్ మార్చారని సిఐడి విచారణలో గుర్తించారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పులతో చంద్రబాబు, లింగమనేని రమేశ్‌ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగిందని, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేదని ఆ సమయంలో వారి భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్లుగా ఉంటే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తర్వాత మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు చేరడం ద్వారా 355 ఎకరాల విలువ మార్కెట్‌ ధర రూ.887.50 కోట్లకు పెరిగిందని అభియోగాల్లో పేర్కొన్నారు.

Whats_app_banner