MP Gorantla Video Issue : న్యూడ్ వీడియో గోరంట్లదే అని చెప్పలేం.. ఫేక్ కావొచ్చు
కొన్ని రోజులుగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై చర్చ నడుస్తోంది. దీనిపై ఆయన బయటకొచ్చి మీడియా సమవేశం పెట్టారు. విచారణకు సిద్ధమన్నారు. ఈ వివాదంపై అనంతపురం పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎంపీ స్థానంలో ఉండి.. ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నించాయి. మరోవైపు నెటిజన్లు సైతం.. ట్రోల్స్ చేశారు. అయితే దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది నిజమైన వీడియో కాదని తెలిపారు. దీనిపై విచారణ చేసినట్టుగా అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కీలక ప్రకటన చేశారు. అది ఒరిజినల్ వీడియో కాదని ఈ కారణంగా మార్ఫింగ్, ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని చెప్పారు.
'ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో స్పష్టంగా చెప్పలేం. ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశాం. అది ఒరిజినల్ వీడియో కాదని గుర్తించాం. ఒకరు వీడియో చూస్తూంటే.. మరొకరు ఆ వీడియోను ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆ వీడియోను అనేక సార్లుగా ఫార్వార్డ్ చేశారు. అది ఒరిజినలో కాదో గుర్తించలేకపోతున్నాం. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చు.' అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు.
ఒరిజినల్ వీడియో లభించలేదని ఎస్పీ చెప్పారు. ఒరిజినల్ వీడియో సోర్స్ ఉంటేనే.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగలమని చెప్పారు. ఈ వీడియో వ్యవహారంపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఈ వీడియో ఆగస్టు 4న తెల్లవారుజామున 2 గంటలకు ఐ టీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారన్నారు. కొద్ది సేపటి ముందే ఆ గ్రూప్‌లో యాడ్ చేసిన యూకే నెంబర్ ద్వారా ఆ వీడియో పోస్ట్ అయినట్టుగా గుర్తించామన్నారు. +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. అది విదేశాలకు చెందిన నెంబర్ కాబట్టి.. ఎవరో కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీడియోలో ఉన్నది ఎవరని చెప్పలేమని పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీకి సంబంధించిన ఓ వీడియో ఏపీలో వైరల్ అయింది. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అది అసభ్యకరంగా ఉంది. ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ తీరుపై తీవ్ర ఆగ్రహం మెుదలైంది. నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు.. ప్రభుత్వం విచారణ చేస్తున్నట్టుగా తెలిపింది.
అయితే ఈ న్యూడ్ కాల్ వివాదంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. కావాలనే తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆశ్లీల వీడియో వెనక.. టీడీపీకి చెందిన వంశీ, విజయ్, శివకృష్ణ ఉన్నారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.