RK Roja : ఎంపీ గోరంట్ల వీడియోపై విచారణకు సీఎం ఆదేశించారు-minister rk roja reaction on mp gorantla madhav video issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rk Roja : ఎంపీ గోరంట్ల వీడియోపై విచారణకు సీఎం ఆదేశించారు

RK Roja : ఎంపీ గోరంట్ల వీడియోపై విచారణకు సీఎం ఆదేశించారు

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 10:21 PM IST

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. విచారణకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు.

<p>మంత్రి ఆర్కే రోజా</p>
మంత్రి ఆర్కే రోజా

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదంపై విచారణకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటే జగన్ సహించరన్నారు. తమ ప్రభుత్వం మహిళల పక్షపాతి అని వివరించారు. సోషల్ మీడియాలో ఎంపీ మాధవ్‌పై వచ్చిన వీడియో.. నిజమో.. కాదో.. తెలుసుకోకుండా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

ఇటీవల తన కుమారుడి కోసం కొనుగోలు చేసిన కారు విషయంలో కూడా అనవసర ఆరోపణలు చేశారని రోజా మండిపడ్డారు. సామాన్యులు కారు కొనుక్కున్నప్పుడు తాను ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. టీడీపీ హయాంలో నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.

ఏం జరిగిందంటే..

వైసీపీ ఎంపీకి సంబందించిన ఓ వీడియో ఏపీలో వైరల్ అయింది. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అది అసభ్యకరంగా ఉంది. ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ తీరుపై తీవ్ర ఆగ్రహం మెుదలైంది. నెటిజన్లు మండిపడ్డారు. ఎంపీ పదవిలో ఉండి.. ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ న్యూడ్ కాల్ వివాదంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. కావాలనే తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆశ్లీల వీడియో వెనక.. టీడీపీకి చెందిన వంశీ, విజయ్, శివకృష్ణ ఉన్నారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

'కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్‌, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోవాలి. ఈ వీడియోను సర్క్యులేట్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ‘నేను జిమ్ చేసే టైమ్ లో తీసిన వీడియోలను మార్ఫింగ్‌ చేశారు. ఆ తర్వాత.. చెత్త వీడియోలను తయారు చేయించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను.'గోరంట్ల మాధవ్‌ అన్నారు.

Whats_app_banner