AP TS Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో ముదురుతోన్న ఎండలు- ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం
AP TS Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
AP TS Heat Wave : మార్చి మొదట్లోనే తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత(AP TS Heat Wave) పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తు్న్నారు. ఏప్రిల్, మేలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. వడగాలుల తీవ్రత(Heat Wave) ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో... మార్చిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీలో మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు వడదెబ్బబారిన(Sun Stroke) పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, తగిన నీళ్లు తాగుతుండాలని సూచించింది.
అధికారులు అలర్ట్
కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే జిల్లాల్లో ప్రజలకు తగిన సూచనలు చేయాలని అధికారులను అలర్ట్ చేశారు. 2016లో అత్యధికంగా 48.6 డీగ్రీలు, 2017లో 47.8 డిగ్రీలు, 2018లో 45.6 డిగ్రీలు, 2019లో 47.3 డిగ్రీలు, 2020లో 47.8 డిగ్రీలు, 2021లో 45.9 డిగ్రీలు, 2022లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపారు. 2023లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నారు.
సెల్ ఫోన్లకు మేసేజ్ లు
వడగాల్పుల దెబ్బకి 2016లో 723 మంది, 2017లో 236, 2018లో 8, 2019లో 28, 2020లో 22 మంది మృతి చెందారని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అధికారుల ముందస్తు చర్యలతో 2022 వరకు వడగాల్పుల మరణాలు సంభవించలేదన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ...జిల్లా యంత్రాంగాలకు రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రతపై సూచనలు జారీ చేస్తుందన్నారు. దీంతో అధికారులు ప్రజలను అలర్ట్ (Weather Alert)చేస్తున్నారన్నారు. ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగా భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు. ప్రజల ఫోన్లకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. విపత్తుల సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే 112, 1070, 18004250101 నెంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
తెలంగాణలో ఎండలు
తెలంగాణలో కూడా ఎండలు దండికొడుతున్నాయి. హైదరాబాద్‌తో(Hyderabad) పాటు పలు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 2023 మార్చి మొదటి వారంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయితే... ఈ ఏడాది ఇప్పుడు సగటున 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 10 రోజులపాటు తెలంగాణలో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, వెళ్లాల్సిన అవసరం ఉంటే గొడుగులు తప్పకుండా తీసుకెళ్లాలని సూచించారు. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి కొబ్బరి నీళ్లు(Coconut Water), ఓఆర్‌ఎస్, మజ్జిగ, నిమ్మకాయ నీరు, తరచుగా తీసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం