APPSC Group 2 Exam : ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాలు ఏర్పాటు
APPSC Group 2 Exam : ఏపీపీఎస్సీ గ్రూపు-2 పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
APPSC Group 2 Exam : ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూపు-2 స్క్రీనింగ్ (APPSC Group 2) పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం జరుగనున్న గ్రూపు-2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు(APPSC Group 2 Exam ) జరుగనున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10.30.గం.ల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. అంతేగాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుంచి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.
సీసీటీవీల పర్యవేక్షణలో
అంతేగాక పరీక్షలు జరిగే తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించామని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ తరలించేందుకు 14 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ వీడియో సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
గ్రూప్-2 పై పుకార్లు నమ్మొద్దు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష యథాతథంగా జరుగుతుందని కమిషన్ స్పష్టం చేసింది. పరీక్ష వాయిదాపై వస్తున్న వదంతుల్ని పుకార్లు నమ్మొద్దని సూచించింది. ఇప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగిలిన వారు కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. గ్రూప్ 2 పరీక్ష కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని, గ్రూప్-2,ఎస్బీఐ క్లర్క్ పరీక్ష హాజరయ్యే వారికి ఎస్‌బీఐ మార్చి 4న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్‌బీఐ పరీక్షకు హాజరయ్యే వారు పరీక్ష తేదీ మార్పు కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం