Minister Roja: ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఎదిగా, నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి మీరెవరు? - మంత్రి రోజా-amaravati minister roja cries tdp leader bandaru satyanarayana objection comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Roja: ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఎదిగా, నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి మీరెవరు? - మంత్రి రోజా

Minister Roja: ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఎదిగా, నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి మీరెవరు? - మంత్రి రోజా

Bandaru Satyaprasad HT Telugu
Oct 04, 2023 06:23 PM IST

Minister Roja: టీడీపీ నేత బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఆవేదన చెందారు. నా క్యారెక్టర్ ను జడ్జి చేయడానికి బండారు ఎవరని ప్రశ్నించారు.

మంత్రి రోజా
మంత్రి రోజా

Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో బండారుపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. టీడీపీ నేత బండారు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు. టీడీపీని వీడినప్పటి నుంచి నా జీవితాన్ని నాశనం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా ఆవేదన చెందారు. ఏదైనా మాట్లాడితే సినిమావాళ్లు అంటున్నారని, టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ కూడా సినిమావారే అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు నేను మంచి నాయకురాలిని... ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక అశ్లీల చిత్రాల్లో నటించానంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెడితే కడుపుమంటతో సీడీలు చూపించారని కన్నీటి పర్యంతం అయ్యారు. నా క్యారెక్టర్‌ గురించి జడ్జి చేయడానికి బండారు ఎవరని ప్రశ్నించారు. నా కుటుంబం కోసం ఎవరి దగ్గరా చేయి చాపకుండా కష్టపడి పనిచేస్తున్నానని మంత్రి రోజా అన్నారు.

yearly horoscope entry point

బండారు లాంటి మతోన్మాద శక్తులను ఎందుకు ప్రశ్నించరు?

ఈ పురుషాధిక్య ప్రపంచంలో మహిళగా నాకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం నలభై ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేశానని మంత్రి రోజా అన్నారు. స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పనిచేశానని తెలిపారు. ఆ పట్టుదలతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కొనసాగుతున్నానన్నారు. మహిళలు ఎంత అభివృద్ధి సాధించినా కొంత మంది పురషుల్లో స్త్రీ పట్ల భావన మారడంలేదన్నారు. బండారు సత్యనారాయణ వంటి కొంతమంది ఆలోచన ధోరణి మారడం లేదని మండిపడ్డారు. తనను అసభ్యమైన పదజాలంతో దూషించిన బండారు లాంటి వ్యక్తులకు మద్ధతిస్తారా? అని జాతీయ మీడియాను ప్రశ్నించారు. పబ్లిక్‌ లైఫ్‌లో పనిచేసే మహిళలు ప్రశ్నార్థకమైన క్యారెక్టర్‌ కలిగి ఉండరన్నారు. బండారు సత్యనారాయణ వంటి మతోన్మాద వ్యక్తులను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

రోజాకు బుద్ధి చెప్పాలనే అలా మాట్లాడాను- బండారు

మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు, అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ స్పందించారు. ఈ కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో తన వైపు నిలబడిందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన...ఉరిశిక్షకైనా సిద్ధం తప్ప సీఎం జగన్ దుర్మార్గపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ నాలుగు నెలలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిదన్నారు. నా సంతకం ఫోర్జరీ అయితే ఆ విషయం నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. మహిళల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. గౌరవంతో బతికే కుటుంబాలపై మంత్రి రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆమెకు బుద్ధి చెప్పాలనే అలా మాట్లాడానన్నారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారన్నారు. మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను సీఎం కూడా విశ్లేషించుకోవాలన్నారు.

Whats_app_banner