Pawan Kalyan : పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో పవన్ స్పీచ్.. 10 ముఖ్యాంశాలు-10 highlights of pawan kalyan speech at the inauguration of palle panduga varotsavalu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో పవన్ స్పీచ్.. 10 ముఖ్యాంశాలు

Pawan Kalyan : పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో పవన్ స్పీచ్.. 10 ముఖ్యాంశాలు

Basani Shiva Kumar HT Telugu
Oct 14, 2024 03:00 PM IST

Pawan Kalyan : చంద్రబాబు అపార అనుభవం రాష్ట్ర అభివృద్ధికి కీలకం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో మాట్లాడిన పవన్.. వచ్చే ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పవన్ స్పీచ్‌లో 10 ముఖ్యాంశాలు ఇవే.

వేదికపై మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వేదికపై మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (@JSPShatagniTeam)

ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం రాష్ట్ర అభివృద్ధికి కీలకం.. అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. పల్లె పండుగ వారోత్సవాలను కంకిపాడులో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

1.గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో, తప్పు దారిలో వెళ్తున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్టీయే కూటమి.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నిలబడి నిబద్ధత నిరూపించుకుంది.

2.ఈరోజు పంచాయతీరాజ్ శాఖ 4,500 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నాం అంటే.. అధికారులతో పాటుగా ఎన్టీయే కూటమి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సహకారం చాలా విలువైనది. మా అందరి ఆకాంక్ష వచ్చే 5 యేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే.

3.ఆగస్టు 23న తీసుకున్న నిర్ణయాలను ఈరోజు శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం సహకారం చాలా కీలకం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

4.ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో తీర్మానాలు చేసుకున్నాం. ఆరోజు తీర్మానం చేసిన పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఈ పనులను సంక్రాంతి లోపు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

5.రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్, గోకులం నిర్మాణాలు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యను తీర్చడం, పారిశుధ్య పనులు, ఇతర 30 వేల అభివృద్ది పనులు చేపట్టేందుకు.. పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు పూర్తి చేసేలా పనిచేయనున్నాం.

6.ప్రధాని నరేంద్ర మోదీ అంటే నాకు చాలా గౌరవం. వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏరోజు నా కోసం ఏమీ అడగను. కానీ సమీప భవిష్యత్తులో మచిలీపట్నం నుండి రేపల్లె వరకు రైల్వే లైన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామని మాటిస్తున్నాను.

7.నేను అందరూ హీరోలు బాగుండాలని కోరుకుంటాను. నేను ఎవ్వరితో పోటీ పడను, ప్రతీ ఒక్కరికీ వారిదంటూ ఒక శైలి ఉంది.

8.నాకు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర ప్రతీ హీరో అన్నా కూడా ఇష్టమే. వారి సినిమాలు విజయం సాధించాలని, మీరు అనందపడాలని కోరుకుంటాను. కానీ మీరు సినిమాలు చూడాలంటే ముందు మీ దగ్గర సంపాదన ఉండాలి కదా. అది సృష్టించడం కోసం మేము పనిచేస్తాం.

9.అభిమానుల కోరిక నాకు తెలుసు. నాకు ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కువ ఆనందం ఇస్తుంది. మీ సమస్యల పరిష్కారం తోపాటుగా మీ ఆనందం కూడా ముఖ్యమే. నేను మరింత బలంగా పనిచేయాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆర్థికంగా నాకు సినిమాలు ఒక్కటే. కాబట్టి తీరిక సమయంలో చేసి మిమ్మల్ని ఆనందింప చేస్తాను.

10.గుడివాడ నియోజకవర్గంలో 43 గ్రామాల్లో నీటి సమస్యను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నా దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు బూతులు, శాపనార్థాలు తప్ప ఈ నీటి సమస్య గురించి పట్టించుకోలేదు. వెంటనే గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రతీ గ్రామానికి టీమ్స్ పంపించి.. నీటి నాణ్యత పరిశీలించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నాను.. అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Whats_app_banner