CM Revanth in Kondareddypalli : సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి రేవంత్ రెడ్డి - అభివృద్ధి పనులకు శంకుస్థాపన-telangana cm revanth reddy visits native village kondareddypalli foundation laying of development works ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth In Kondareddypalli : సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి రేవంత్ రెడ్డి - అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth in Kondareddypalli : సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి రేవంత్ రెడ్డి - అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 13, 2024 07:52 AM IST

దసరా వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించగా… మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సొంత గ్రామానికి వచ్చిన రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్
కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. 

డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.

రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.

సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలో ముఖ్యమంత్రి రూ.21 కోట్ల 39 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు.అనంతరం గ్రామ పంచాయితీ భవన ఆవరణలో మొక్కను నాటారు. ఆ తర్వాత ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

శంకుస్థానలు, పూజలు పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లారు.  కుటుంబసభ్యులు, బంధువులతో కొన్ని గంటల పాటు గడిపారు. సాయంత్రం నివాసం నుంచి గ్రామ శివారులోని జమ్మి చెట్టు వద్దకు ర్యాలీగా వెళ్ళారు.అనంతరం మనవడితో కలిసి జమ్మి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన సొంత గ్రామస్తులు  దసరా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్వగ్రామానికి రావటంతో కొండారెడ్డిపల్లిలో సందడి నెలకొనట్లు అయింది.

Whats_app_banner