Pawan Kalyan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. రూ.60 లక్షలు విరాళం-pawan kalyan donated 60 lakh rupees to the sports ground ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. రూ.60 లక్షలు విరాళం

Pawan Kalyan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. రూ.60 లక్షలు విరాళం

Basani Shiva Kumar HT Telugu
Oct 10, 2024 12:38 PM IST

Pawan Kalyan : ఇటీవల రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరవారిపల్లి గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు అక్కడి ప్రజలు.. తమ పాఠశాలలో క్రీడా మైదానం లేదని చెప్పారు. దీంతో తాను క్రీడా మైదానానికి కావాల్సిన నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం రూ.60 లక్షలు ఆ గ్రామస్తులకు అందజేశారు.

పంచాయతీ సభ్యులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్
పంచాయతీ సభ్యులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ (@JanaSenaParty)

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లి పాఠశాలకు.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రూ.60 లక్షలు ఇచ్చారు. తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లారు. అప్పుడు అక్కడి పాఠశాలకు మైదానం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

దసరా పండగలోపు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను బుధవారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు.

'రాజకీయాల్లోకి రావడానికి ముందే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్‌ కళ్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్సు పేరిట.. ట్రస్టు మొదలుపెట్టాను. విద్యార్థుల చదువుకు సాయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ట్రస్టు ఉద్దేశం. ఎంతోమంది పేద విద్యార్థుల చదువులకు సాయం చేసినా బయటకు చెప్పలేదు. మైసూరవారిపల్లిలో ఆటస్థలం కోసం తొలుత రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తానికి దాతల సహకారం తీసుకోవాలనుకున్నా. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మొత్తం రూ.60 లక్షలు ఇచ్చాను' అని పవన్ కళ్యాణ్ వివరించారు.

'ప్రతి ఒక్కరు మన పిల్లలు దృఢంగా తయారు కావాలి. చదువుకోవాలి. మానసికంగా ఎదగాలి అని కోరుకుంటాము. పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే అగ్గిపెట్టె ల్లాంటి గదుల్లో పెట్టేస్తాం. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పరిస్థితులు మారాలి' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి అమ్మిన పగడాల పద్మావతిని పవన్ కళ్యాణ్ సత్కరించారు. పాఠశాల విద్యార్ధులకు క్రికెట్ కిట్లు, వాలీ బాల్, ఫుట్ బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండు సెట్లు అందించారు. విద్యార్ధులు, స్థలం విక్రయించినవారు, ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన పార్టీ నాయకులు, అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు.

Whats_app_banner