Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో మొక్కల పంపిణీ చేయాలన్న నటుడు షాయాజీ షిండే… స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్-deputy cm pawan welcomes actor shayaji shinde advice to distribute plants as prasad in temples ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో మొక్కల పంపిణీ చేయాలన్న నటుడు షాయాజీ షిండే… స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్

Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో మొక్కల పంపిణీ చేయాలన్న నటుడు షాయాజీ షిండే… స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 09, 2024 09:58 AM IST

Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కల్ని పంపిణీ చేయాలని నటుడు షాయాజీ షిండే ఇచ్చిన సలహాను ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే సూచించారు.

నటుడు షాయాజీ షిండేతో పవన్ కళ్యాణ్
నటుడు షాయాజీ షిండేతో పవన్ కళ్యాణ్

Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతోపాటు మొక్క ఇవ్వాలని నటుడు షాయాజీ షిండే చేసిన ఆలోచనను స్వాగతిస్తున్నట్టు పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో మొక్కల్ని ప్రసాదంతో పాటు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తానని ప్రకటించారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు కలుగుతుందన్నారు.

ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చని నటుడు షాయాజీ షిండే చేసిన సూచనను స్వాగతిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. షిండే ఆలోచన అభినందనీయమైనదనన్ారు. ఆయన చేసిన సూచన అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని చెప్పారు.

మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఆలోచనలు పంచుకున్నారు. వృక్ష ప్రసాద్ యోజనను మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే పవన్‌ కళ్యాణ్‌కు వివరించారు.

ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టత గురించి మరాఠీలో రాసుకున్న కవితను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చదివి వినిపించారు. ఆ కవితను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తూ ఆ మరాఠీ కవితను తెలుగులో అనువదించి చెప్పారు.

“మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని బోధిస్తున్నాయి. వచ్చే తరాలకు సుందరమైన పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే నేటి తరానికి మొక్కల విశిష్టతను తెలపాల్సిన అవసరం ఉంది. దీని కోసం ఆలయాలకు పూజల నిమిత్తం వచ్చే భక్తులకు ప్రసాదంతోపాటు మొక్కలను అందించి వాటిని పెంచేలా ప్రోత్సహించాలి. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉందని షిండే వివరించారు.

మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విరివిగా మొక్కలను నాటడం తన జీవన అలవాట్లలో భాగం అయ్యింది. నా తల్లి కన్ను మూసినప్పుడు ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చాలా ప్రాంతాల్లో నాటినట్టు షాయాజీ షిండే వివరించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో పంచుకున్నట్టు చెప్పారు.

దేవాలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదాలతోపాటు మొక్కలను దేవుడు ఇచ్చిన బహుమతిగా అందిస్తే వాటిని వారు నాటడం, సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు కలుగుతుంది" అని వివరించారు.

Whats_app_banner