Pithapuram Crime : పిఠాపురంలో బాలిక‌పై అత్యాచారం, నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ భ‌ర్తే- స్పందించిన పవన్ కల్యాణ్-pithapuram dalith minor girl molested tdp ex counsellor husband pawan kalyan responded ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pithapuram Crime : పిఠాపురంలో బాలిక‌పై అత్యాచారం, నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ భ‌ర్తే- స్పందించిన పవన్ కల్యాణ్

Pithapuram Crime : పిఠాపురంలో బాలిక‌పై అత్యాచారం, నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ భ‌ర్తే- స్పందించిన పవన్ కల్యాణ్

HT Telugu Desk HT Telugu
Oct 08, 2024 04:05 PM IST

Pithapuram Crime : కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త అత్యాచారం చేశాడు. బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా మద్యం పట్టించి, ఆపై బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఓ మహిళ సహకరించింది.

పిఠాపురంలో బాలిక‌పై అత్యాచారం, నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ భ‌ర్తే- స్పందించిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో బాలిక‌పై అత్యాచారం, నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ భ‌ర్తే- స్పందించిన పవన్ కల్యాణ్ (HT)

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ద‌ళిత బాలిక అత్యాచారానికి గురైంది. అత్యాచార నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ భ‌ర్తగా పోలీసులు గుర్తించారు. మ‌ద్యం సేవించి అతడు ఈ అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. బాధితురాలి మేన‌త్త ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ కేసులు స‌హా ఎనిమిది కేసులు న‌మోదు అయ్యాయి.

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో బాలికపై అత్యాచార ఘ‌ట‌న‌ కలకలం రేపింది. ప‌ట్టణంలోని ఒక‌ కాల‌నీకి చెందిన 16 ఏళ్ల ద‌ళిత బాలిక‌పై టీడీపీకి చెందిన 14వ వార్డు మాజీ కౌన్సిల‌ర్ దుర్గాడ‌ విజ‌య‌ల‌క్ష్మి భ‌ర్త జాన్ అత్యాచారం చేశారు. జాన్ ఆటో డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్నాడు. జ‌ట్టు కూలీల మేస్త్రీగా ఉన్న 50 ఏళ్ల మ‌హిళ సుబ్బల‌క్ష్మీ స‌హాయంతో నిందితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. సుబ్బల‌క్ష్మీ కూడా జాన్ నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన‌దే.

జ‌ట్టు మేస్త్రీ క‌నుక మ‌హిళ‌ల‌ను ప‌నుల‌కు చుట్టు ప్రక్కల ఊళ్లకు తీసుకెళ్లేట‌ప్పుడు జాన్ ఆటోనే బుక్ చేస్తుంది. ఆ ర‌కంగా ఇద్దరికి బాగా ప‌రిచ‌యం ఉంది. అలాగే జాన్, సుబ్బల‌క్ష్మీ ఇద్దరికీ మ‌ద్యం అల‌వాటు ఉంది. కొన్ని సార్లు ఇద్దరూ క‌లిసి మ‌ద్యం తాగారు. సోమ‌వారం కూడా మ‌ద్యం తాగేందుకు ఇద్దరూ సిద్ధం అయ్యారు. మ‌ద్యం సేవించ‌డానికి వెళ్తూ మ‌ధ్యాహ్నం పిఠాపురం స్టేట్ బ్యాంక్ వ‌ద్ద ఎవ‌రూ లేని స‌మ‌యంలో బాలిక‌ను జ‌ట్టు మేస్త్రీ సుబ్బల‌క్ష్మీ అడ్రస్ అడుగుతూ యామ‌ర్చింది. వెంట‌నే బాలిక‌ను బ‌ల‌వంతంగా ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష‌ ప్రాంత‌మైన‌ మాధవపురం డంపింగ్ యార్ట్‌లోకి తీసుకువెళ్లారు.

అక్కడ జాన్‌, సుబ్బల‌క్ష్మీ మ‌ద్యం సేవించి, బాలికకు కూడా బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించారు. దీంతో బాలిక అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు అక్కడే ఉండి అప‌స్మార‌క స్థితిలో ఉన్న బాలిక‌పై అత్యాచారం చేశారు. అనంత‌రం ఆ బాలిక‌ను తిరిగి ఆటోలో ఎక్కిస్తున్న స‌మ‌యంలో చెత్త కాగితాలు ఏరుకుంటున్న మ‌హిళ చూసి, ఆ బాలికను గుర్తు ప‌ట్టి ఆటో ద‌గ్గర‌కు వెళ్లింది.

అప్పటికీ కూడా బాలిక అప‌స్మార‌క స్థితిలోనే ఉంది. ఈ బాలిక‌ను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఈ బాలిక‌కు ఏమైందని ఆ మ‌హిళ ప్రశ్నించింది. దానికి జాన్‌, సుబ్బల‌క్ష్మీ నీళ్లు నిమిలి, పొంత‌న లేని స‌మాధానాలు ఇచ్చారు. అక్కడ నుంచి ముందుకు వెళ్లడానికి ఆటోకి ప్లేస్ లేదు. అది పుంత రోడ్డు కావ‌డం, అందులోనూ ఆటోకి ముందు భారీ వ్యాన్ ఉండ‌టంతో ఆటో ముందుకు వెళ్లలేక‌పోయింది. ఈలోపు బాలిక‌ను గుర్తించిన మ‌హిళ, ఆ బాలిక కాల‌నీకి చెందిన వారికి ఫోన్ చేసింది. ఈ లోపు ఆ స‌మీపంలో మ‌ద్యం సేవిస్తున్నా కొంత మంది కుర్రోళ్లు, ఇది చూసి అక్కడ‌కు చేరుకున్నారు. ఆటో డ్రైవ‌ర్ జాన్‌, జ‌ట్టు మేస్త్రీ సుబ్బలక్ష్మీని ప‌ట్టుకున్నారు. అలాగే ఘ‌ట‌న స్థలానికి బాలిక కుటుంబ స‌భ్యులు, బంధువులు చేరుకున్నారు.

వారిద్దరికీ దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్పగించిన‌ట్లు బాధితులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వ‌ర‌కు నిందితుడు త‌మ అదుపులో ఉన్నాడ‌ని ప్రక‌టించ‌లేదు. బాలిక‌ను పిఠాపురం ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సోమ‌వారం వైద్య ప‌రీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. మద్యం పట్టించిన అనంతరం అత్యాచారం చేశాడంటూ బాలిక మేనత్త పిఠాపురం ప‌ట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో, కిడ్నాప్ కేసుతో స‌హా ఎనిమిది సెక్షన్‌ల్లో కేసు న‌మోదు చేశారు. చికిత్స పొందుతున్న బాధిత బాలిక‌ను సీపీఎం, మ‌హిళ సంఘం (ఐద్వా) నేత‌లు ప‌రామ‌ర్శించి, నిందితులను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. బాలిక తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివి మానేసి ఇంటి వ‌ద్దే ఉంటుందని తెలుస్తోంది.

బాధితులకు అండగా ఉంటాం - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాలికపై దారుణం తెలిసి చాలా బాధపడ్డానన్నారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేసి బాధిత బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించానన్నారు. బాధిత బాలికకు, కుటుంబానికి అండగా ఉండామని హామీ ఇచ్చారు. స్థానిక జనసేన నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner