తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharat Rashtra Samithi : బీఆర్ఎస్ జాతీయ పార్టీ కలలు ఏమాయే? మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మరోసారి చర్చ

Bharat Rashtra Samithi : బీఆర్ఎస్ జాతీయ పార్టీ కలలు ఏమాయే? మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మరోసారి చర్చ

HT Telugu Desk HT Telugu

18 October 2024, 11:44 IST

google News
    • Bharat Rashtra Samithi : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ గురించి చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్.. ఈసారి మహారాష్ట్రలో పోటీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్
కేసీఆర్

కేసీఆర్

పది నెలల కిందట అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తిరిగి పుంజుకునేందుకు క్షేత్ర స్థాయిలో చేయని ప్రయత్నమంటూ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ.. మీడియా వేదికగా హడావిడి చేస్తూనే ఉంది. ఆ పార్టీ నాయకులు ప్రధానంగా మాజీ మంత్రులు హరీష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తూర్పారా పడుతున్నారు.

సమీపంలో ఎలాంటి ఎన్నికలు లేనందున ఇప్పటికిప్పుడు గులాబీ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని నిరూపించుకునే అవకాశమే లేదు. కానీ.. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల కిందట మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మరి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు, బీఆర్ఎస్ ప్రజా బలానికి ఏమిటి సంబంధం..?

ఫలితమివ్వని జాతీయ పార్టీ ప్రయోగం..

సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సుసాధ్యం చేసిన నాటి టీఆర్ఎస్.. తెలంగాణలో వరుసగా 2014, 2018లో అధికారంలోకి వచ్చింది. పదేళ్ల పదవీ కాలంలో తమ ప్రాబల్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని, కేంద్రంలో చక్రం తిప్పాలని కలలుకని.. టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌గా మార్చుకుంది. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, కె.చంద్రశేఖర్ రావు వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలపై బీఆర్ఎస్ కన్నేసింది. రెండు చోట్లా చేరికలతో ఊపు మీద కనపడింది. ఏపీ, మహారాష్ట్రలో పార్టీ కమిటీలను కూడా నియమించింది. ప్రస్తుతం మహారాష్ట్ర విషయం వరకే పరిమితమై మాట్లాడుకుంటే.. పూర్వపు హైదరాబాద్ స్టేట్ (నిజాం స్టేట్) లో అంతర్భాగంగా ఉండిన నాందేడ్, ఔరంగాబాద్ నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు, పాత అనుంబంధాలను పరిగణలోకి తీసుకుని.. మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టింది. చివరకు నాందేడ్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది.

అదే సమయంలో వచ్చిన మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసింది. నాగపూర్ డివిజన్‌లో భండారా, విదర్భ, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో కొన్ని పంచాయతీల్లో బోణీ కొట్టి ఉనికి చాటుకుంది. కానీ, ఆ తర్వాత అటు మహారాష్ట్ర, ఇటు ఏపీలో ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో ఆ పార్టీ జాతీయ కలలకు తెరపడిందా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ చేసిన జాతీయ పార్టీ ప్రయోగం ఫలితం ఇవ్వలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తుందా..?

స్వల్ప సమయంలోనే మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కొంత ఉనికి చాటినా, 2023 ఆఖరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వంద స్థానాల నుంచి 39 స్థానాలకు పడిపోయి అధికారాన్ని కోల్పోయింది. ఆ మరుసటి ఏడాది 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేక చతికిలపడింది. ఈ రెండు ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీని వీడి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వెళ్లిపోతుండడం కూడా కేడర్‌పై తీవ్ర ప్రభావం చూపెడుతోంది.

తెలంగాణలో ప్రాభవం కోల్పోతున్న బీఆర్ఎస్ ఇక్కడే తిరిగి నిలదొక్కుకునే పనిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇపుడు మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదంటున్నారు. ఆ పార్టీలో చేరిన మహారాష్ట్రకు చెందిన నాయకులు.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన మానిక్ రావ్ కదం, బీడ్ జిల్లా ఇంఛార్జిగా పనిచేసిన దిలీప్ గోరె వంటి నాయకులు, వారి అనుచరులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది.

తెలంగాణ ఎన్నికల్లో బొక్కా బోర్ల పడిన బీఆర్ఎస్.. 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల ఊసు కూడా ఎత్త లేదు. అదే మాదిరిగా ఇపుడు మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల గురించి కూడా మాటెత్తే అవకాశమే లేదంటున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, కాంగ్రెస్, బీజేపీయేతర తృతీయ కూటమి కట్టాలని, జాతీయ పార్టీగా వెలుగు వెలగాలని ఆశించిన బీఆర్ఎస్‌కు.. ఆ పార్టీ నేత కేసీఆర్ కలలు కల్లలు అయినట్లే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

(రిపోర్టింగ్- క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్)

తదుపరి వ్యాసం