Singareni : బీఆర్ఎస్ సింగరేణి నిరసన దీక్ష భగ్నం.. టెంట్ కూల్చేసిన పోలీసులు.. ఉద్రిక్తత-tension in singareni protest initiated by brs in peddapalli ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni : బీఆర్ఎస్ సింగరేణి నిరసన దీక్ష భగ్నం.. టెంట్ కూల్చేసిన పోలీసులు.. ఉద్రిక్తత

Singareni : బీఆర్ఎస్ సింగరేణి నిరసన దీక్ష భగ్నం.. టెంట్ కూల్చేసిన పోలీసులు.. ఉద్రిక్తత

HT Telugu Desk HT Telugu
Oct 07, 2024 06:01 AM IST

Singareni : పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్, దాని అనుబంధ కార్మిక సంఘం టీబీజికేఎస్ చేపట్టిన సింగరేణి నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకొని టెంట్‌ను తొలగించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది.

బీఆర్ఎస్ సింగరేణి నిరసన దీక్ష భగ్నం
బీఆర్ఎస్ సింగరేణి నిరసన దీక్ష భగ్నం

దసరా పండగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు ప్రకటించిన బోనస్ ఆందోళనకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం.. లాభాల్లో 33 శాతం బోనస్ ప్రకటించింది. కానీ ఉద్యోగులకు కేవలం 16 శాతం మాత్రమే బోనస్ అందుతుండడంతో.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆందోళనకు పిలుపునిచ్చింది. అందోళనలో బాగంగా ఆదివారం గోదావరిఖనిలో సింగరేణి నిరసన దీక్ష చేపట్టింది.

ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.‌ టెంట్ కూల్చి.. తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో వందలాది మంది అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మద్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరిగి టెంట్ కుప్పకూలింది.‌ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించి దీక్ష వేదికను తొలగించారు.

నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు పైనే బైఠాయించారు.‌ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో.. ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు చందర్, పుట్ట మధుకర్, దివాకర్ రావు తోపాటు వందలాది మంది కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, కండువాలు ధరించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్షను భగ్నం చేసినంత మాత్రాన ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన 33 శాతం బోనస్ ఇచ్చే వరకు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రకటించింది 33 శాతం.. ఇచ్చేది 16 శాతం..

2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభం రూ.4,701 కోట్లు. నికర లాభాల్లో 33 శాతం బోనస్‌గా సింగరేణి ఉద్యోగులకు ఇస్తున్నట్లు యాజమాన్యం, ప్రభుత్వం ప్రకటించింది. అయితే..33 శాతం ఇస్తామని ప్రకటించి.. కేవలం 16 శాతం మాత్రమే బోనస్‌గా ఇస్తున్నారని.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఉద్యోగులను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పినట్టు 33 శాతం బోనస్ రూ. 1550 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner