R Krishnaiah Resigned : వైసీపీకి మరో బిగ్ షాక్, రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా
R Krishnaiah Resigned : వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8కి తగ్గింది.
R Krishnaiah Resigned : వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ ఎంపీ, బీసీ నేత ఆర్. కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కృష్ణయ్య బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం అనంతరం ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు.
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి మరో రాజ్యసభ సీటు ఖాళీ అయినట్టు బులెటిన్ విడుదలైంది. 100 బీసీ కుల సంఘాలతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతంచేసేందుకే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు.
కీలక నేతల రాజీనామాలతో రాజ్యసభలో వైసీపీ బలం తగ్గుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో రాజ్యసభలో 11 ఎంపీల నుంచి 8కు తగ్గింది. ఇటీవల ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య సైతం వైసీపీని వీడారు. మరికొంత మంది వైసీపీని వీడేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో 8కి తగ్గిన వైసీపీ బలం
లోక్ సభలో తమకు బలం లేకపోయినా రాజ్యసభలో బలం ఉందని వైసీపీ నేతలు ఇన్నాళ్లు భావించారు. కేంద్రానికి వైసీపీ అవసరం ఉంటుందని ఆ పార్టీ భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు... ఇందుకు భిన్నంగా మారుతున్నాయి. రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. వైసీపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది సభ్యులు ఉండగా... వీరిలో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 8కి తగ్గిపోయింది. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, వి. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని ఉన్నారు.
అయితే మరో ఐదుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని విడనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీ బలం మరింత తగ్గుతుంది. ప్రచారం జరుగుతున్నట్టు మరో ఐదుగురు రాజీనామా చేస్తే.. వైసీపీ బలం 3కు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే పక్షాలే అధికారంలో ఉండడంతో... ఆ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారితే రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేతలు భావిస్తున్నారని సమాచారం.
సంబంధిత కథనం