తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు - మూడో రోజుకు చేరిన పవర్ లూమ్ కార్మికుల దీక్షలు

సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు - మూడో రోజుకు చేరిన పవర్ లూమ్ కార్మికుల దీక్షలు

HT Telugu Desk HT Telugu

24 July 2024, 18:36 IST

google News
    • Weavers Protest in Sircilla : సిరిసిల్లలో నేతన్నలు నిరసన చేపట్టారు. విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలని…. ఈ మేరకు ప్రకటన చేయాలని నినాదాలు చేశారు.
సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు
సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు

సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు

Weavers Protest in Sircilla : కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నేత కార్మికులు రోడ్డెక్కారు. పవర్ లూమ్ పరిశ్రమ బంద్ అయి 9 మాసాలు అవుతున్నా, ఉపాధి కల్పించే చర్యలు కానరాక, ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో నేతన్నలు నిరాహార దీక్షలు చేపట్టారు. 

మూడు రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షలో భాగంగా కార్మికులు కార్మిక సంఘాల నాయకులు సెస్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నేతల ఆందోళనకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

వస్త్రపరిశ్రమకు ఉపాధి కల్పించాలని, 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఆంక్షలు లేకుండా కొనసాగించాలని కోరుతూ సిరిసిల్లలో నేతన్నలు వస్త్ర పరిశ్రమను బంద్ చేశారు. కార్మికులతో కలిసి మూడు రోజుల క్రితం రిలే దీక్షలు చేపట్టారు. ఓ వైపు వర్షం పడుతున్నా అంబేడ్కర్ చౌరస్తాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలకు బిఆర్ఎస్ తోపాటు వామపక్ష పార్టీల నాయకులు మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. 

ఓవైపు నిరాహార దీక్షల కొనసాగుతూనే మరోవైపు విద్యుత్ సమస్యపై సహకార విధ్యుత్ సరఫరా సంస్థ (సెస్) కార్యాలయాన్ని ముట్టడించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు, పలుకార్మిక సంఘాల జేఏసీ ఆద్వర్యములో సెస్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పవర్ లూమ్ పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీని అందించాలని కార్మికులు, ఆసాములు, వస్త్ర పరిశ్రమ యజమానులు డిమాండ్ చేశారు. సెస్ అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలి….

దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే… మానాన్ని కాపాడేది నేతన్నలని, అలాంటి నేతన్నల పరిస్థితి నేడు ఆగమ్య గోచరంగా మారిందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ మూతపడి 9 నెలలు అవుతుందని, పనులు లేక ఇప్పటికే 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై గత ప్రభుత్వం చేసిన పాపాలు, ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతుందని ఆరోపించారు. 

ఓ వైపు పనులు లేక పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే, ఇక్కడి సెస్ అధికారులు 4 వ రకం కేటగిరీలో ఉన్న పరిశ్రమలను 3 వ కేటగిరీలో వేసి విద్యుత్  బకాయిలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే విధ్యుత్ బకాయిలను వసూల్ చేయాలని విజ్ణప్తి చేశారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ప్రభుత్వానికి నివేదించి, విధ్యుత్ సబ్సిడీ అందేలా సెస్ అధికారులు చూడాలని డిమాండ్ చేశారు.

పరిష్కరించకుంటే ఛలో హైదరాబాద్...

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత తొమ్మిది నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కార్మికులు, ఆసాములు, వస్త్రపరిశ్రమ మీద ఆధారపడ్డవాళ్ళు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పదిమంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 

వస్త్రపరిశ్రమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈనెల 26 లోపు కరెంటు సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి బాధ్యత వహించాలని, వస్త్రంపై విధించిన జీఎస్టీ రద్దు చేయాలని, కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వస్త్రపరిశ్రమ సమస్యలపై దృష్టిసారించాలన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నేతన్నల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. 

జులై 26లోగా సమస్యలు పరిష్కరించకుంటే... చలో హైదరాబాద్ చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామనని వామపక్ష కార్మిక సంఘాలు ప్రతినిదులు హెచ్చరించారు.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం