GST collections: ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ సెస్ వసూళ్లు
GST collections: భారత్ లో ప్రతీ నెల జీఎస్టీ వసూళ్లు కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (Goods and Services Tax GST) వసూళ్లు 12% పెరిగాయి.
GST collections: ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.49 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ఫిబ్రవరి నెలలో సెస్ (CESS) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయని తెలిపింది. ఈ ఫిబ్రవరిలో రూ. 11,931 కోట్ల సెస్ (CESS) వసూలయిందని వెల్లడించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత సెస్ వసూలుకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తమని వెల్లడించింది.
GST collections: ఏప్రిల్ 2022 దే రికార్డు..
అయితే, జీఎస్టీ (GST) వసూళ్లకు సంబంధించి ఏప్రిల్ 2022 సృష్టించిన రికార్డు కొనసాగుతూనే ఉంది. ఆ నెలలో మొత్తం రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ (GST) వసూలయింది. ఈ సంవత్సరంలో జనవరి నెలలో అత్యధికంగా రూ. 1.57 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయింది. ఇది రెండో అత్యధిక జీఎస్టీ వసూలు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 2022, ఏప్రిల్ లో వసూలయిందే అత్యధిక జీఎస్టీ (GST) మొత్తం. కాగా, ‘‘ఈ ఫిబ్రవరి లో దేశవ్యాప్తంగా రూ. 1,49,577 కోట్ల జీఎస్టీ వసూలయింది. అందులో రూ. 27,662 కోట్లు సీజీఎస్టీ (CGST) కాగా, రూ. 34,915 కోట్లు ఎస్ జీఎస్టీ (SGST), రూ. 75,069 కోట్లు ఐజీఎస్టీ (IGST). రూ.11,931 కోట్లు సెస్ (CESS)’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం ఫిబ్రవరి లో జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.33 లక్షల కోట్లు కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అది రూ. 1.49 లక్షల కోట్లు. అంటే, గత ఫిబ్రవరి కన్నా ఈ ఫిబ్రవరిలో 12% అధికంగా జీఎస్టీ (GST) వసూలయింది. సాధారణంగా, లీప్ ఈయర్ ను మినహాయిస్తే, ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి కనుక, కొంత తక్కువ మొత్తంలోనే జీఎస్టీ (GST) వసూలు కావడం పరిపాటి.