KCR petition: విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్‌ను తప్పు పట్టిన సీజేఐ, కొత్త ఛైర్మన్ ఎంపికపై కసరత్తు
KCR petition: తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని సీజేఐ ఆదేశించారు.
KCR petition: తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సీజేఐ బెంచ్ విచారణ చేపట్టింది. కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో బీఆర్‌ఎస్ అధినేత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మంగళవారం ఉదయం కేసీఆర్ పిటిషన్‌పై ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చత్తీస్‌ఘడ్‌తో చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జూన్ 30వ తేదీ వరకు విచారణకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరో నెల పాటు దానిని పొడిగించారు. ఈ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాలపై మరో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం సరికాదంటూ కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ నరసింహరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించాన్ని సీజేఐ తప్పు పట్టారు. న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా న్యాయం చేసినట్టు,నిష్పాక్షికంగా కనిపించాలన్నారు. కమిషన్ ఛైర్మన్‌ను తప్పించాలని ఆదేశించారు.
కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా, యూనిట్ 3.90 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేశామని రోహిత్గీ వాదించారు.
మాజీ ముఖ్యమంత్రిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆర్టీఐలు వేశారని, ఇది కక్ష సాధింపు చర్య మాత్రమేనన్నారు. విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారని, ఈ ఆర్ సి ఉండగా, మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదని రోహత్గీ వాదించారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని, మరో రాష్ట్ర ప్రభుత్వము నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని, ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్ కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో విచారణ జరుగుతుండగా కమిషన్ ఛైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని, కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని, తక్షణం మరొక జడ్జిని నియమించాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల్లోగా మరో న్యాయమూర్తిని కమిషన్ ఛైర్మన్‌గా నియమించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. భోజన విరామం తర్వాత విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుంది. కొత్త కమిషన్ ఛైర్మన్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ కొనుగోలు నిర్ణయాలపై విచారణ కొనసాగనుంది. కమిషన్ చైర్మన్ విషయంలో మాత్రమే కేసీఆర్‌కు ఊరట దక్కనున్నట్టు తెలుస్తోంది.