Paper Leak Case: ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు .. KTRతో సహా వారిని విచారించాలన్న రేవంత్ రెడ్డి
31 March 2023, 15:43 IST
- Paper Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. కేసును పూర్తిస్థాయిలో విచారించాలని కోరారు.
ఈడీ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి
TPCC Complaint To ED On Paper Leak Case: పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్ది అక్రమాలు బయటికి వస్తున్నాయి. ఓవైపు సిట్ విచారణ జరుగుతుండగా... మరోవైపు అరెస్టులపర్వం కొనసాగుతూనే ఉంది. కేసుకు సంబంధమున్న వారికి నోటీసులు జారీ చేసి విచారిస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ టార్గెట్ గా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. కేటీఆర్ బర్తరఫ్ చేయటంతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... తెలంగాణ కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఈడీకి గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలతో కలిసి ఫిర్యాదును ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.... టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలోఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని... లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నామని... కానీ సిట్ తో కేసులు వేయించి విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజ్ లో శంకరలక్ష్మి దగ్గర నుంచి నేరం మొదలైందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను పెట్టాలని డిమాండ్ చేశారు. కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని... ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని చెప్పారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపించేలా... ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి పిర్యాదు చేశామని తెలిపారు. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయన్న రేవంత్ రెడ్డి.... కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరినట్లు పేర్కొన్నారు.
"సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు సమాచారం ఉంది. పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరాం. జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరు.కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకె తెలియదు. కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయి?పారదర్శక విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హామీ ఇచ్చారు. పరువు ఉన్న వారు పరువు నష్టం దావా వేస్తారు. కేటీఆర్ తెలంగాణ పరువును తీసేశారు. నిజంగా కేటీఆర్ కు పరువు ఉంటే సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శక విచారణకు అదేశాలివ్వాలి. లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖ రాయాలి. కేటీఆర్ పరువు 100కోట్లు అని ఎలా నిర్ణయిస్తారు? విద్యార్థులు, నిరుద్యోగుల ఉసురు తీయొద్దు..వాళ్ల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు" అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.