Paper Leak Case : ఆమెను సాక్షిగా ఎలా చేర్చారు? వారిని కూడా సిట్ లో చేర్చాలన్న రేవంత్ రెడ్డి -tpcc president revanth reddy slams brs govt over ou students arrest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tpcc President Revanth Reddy Slams Brs Govt Over Ou Students Arrest

Paper Leak Case : ఆమెను సాక్షిగా ఎలా చేర్చారు? వారిని కూడా సిట్ లో చేర్చాలన్న రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Mar 24, 2023 04:05 PM IST

TSPSC Paper Leak Case: 50 లక్షల నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఓయూలో నిరసన తెలిపాలని అనుకుంటే... రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడతో తమని నిర్బంధించిందనఅనారు. ఓయూలో తలపెట్టిన నిరుద్యోగ నిరసనలో పాల్గొనాల్సిన తనను వందలాది మంది పోలీసులను పెట్టి గృహానిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy: అక్రమ నిర్బంధాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఆటవిక చర్య అని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్ నాయకులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నేరాల్ని కప్పిపుచుకోవడానికె ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడుతోందన్నారు. అనర్హులను టీఎస్పీఎస్సీలో సభ్యులుగా నియమించారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి నియమించడాన్ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక రెడ్డి కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఎలా తీసుకుందని కౌంటర్ వేయాలని హైకోర్టు సూచించిందని... కానీ ప్రభుత్వం కౌంటర్ వేయకుండా వాయిదాలు తీసుకుందని అన్నారు. అనర్హులకు అందలం వేయడం వల్లే ఈ అనర్థం జరిగిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"90 మంది అభ్యర్థులను 1 నుంచి 3.30 వరకు లాలాగూడ ఎస్ ఎఫ్ ఎస్ హైస్కూల్ సెంటర్ లో పరీక్ష రాయించినట్లు పత్రికల్లో వచ్చాయి. మధ్యాహ్నం 1 గంట వరకే నిర్వహించాల్సిన పరీక్షను సమయం దాటిన తరువాత కొందరికి పరీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగాయని స్పష్టంగా ఉన్నా... ఈ అంశాలపై సిట్ అధికారి విచారణ చేయడం లేదు. ఈ వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందంటే ఇందులో పెద్దల హస్తం ఉంది. ఇది మా నిర్దిష్టమైన ఆరోపణ. కేసు సిట్ కు బదిలీ చేయడం వెనక గూడుపుఠానీ దాగుంది. కేసును నీరుగార్చడానికే పేపర్ లీక్ కేసును సిట్ కు బదిలీ చేశారు. ఈ కేసులో మొదట విచారణ చేయాల్సింది కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మీనే. కానీ శంకర లక్ష్మీని విట్ నెస్ గా చూపించారు. నిందితులపై అవినీతి నిరోధక సెక్షన్స్ పెట్టాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆ ఆపని చేయలేదు. ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా సిట్ లో పెట్టాలి" అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రత్యక్షంగా కేటీఆర్ కు సంబంధం ఉందని మరోసారి ఆరోపించారు రేవంత్ రెడ్డి. "2021 టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. లాలగూడలో సమయం దాటినా తరువాత జరిగిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అందరినీ విచారించాలి. అవినీతి నిరోధక శాఖ పరిధిలో ఉండే సెక్షన్ అన్నింటినీ కేసులో పొందుపరచాలి. శంకర లక్ష్మీ చేతిలో ఉండాల్సిన తాళాలు ఎవరి చేతిలోకి వెళ్లాయో తేల్చాలి. పెద్ద తలల్ని సిట్ విచారణ చేయాల్సిందే. శంకర లక్ష్మిని సాక్షిగా కాదు.. నిందితులుగా చేర్చాలి" అన్నారు.

కాంగ్రెస్ శ్రేణులంతా ఓయూ నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఓయూ నిరసన దీక్షలో పాల్గొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ముఖ్య నాయకులతో ఢిల్లీకి వెళ్లి ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు పిర్యాదు చేస్తామన్న ఆయన... ఏప్రిల్ 2వ వారంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ నిరసన కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పాదయాత్రను ఏప్రిల్ 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ పై కేంద్రం చర్యలు దుర్మార్గమన్నారు రేవంత్ రెడ్డి. "భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ పై బీజేపీ కక్ష సాధింపునకు పాల్పడుతోంది. మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోంది" అని మండిపడ్డారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం