Revanth Reddy SIT Investigation: అన్నీ విషయాలు ఆయనకు తెలుసు... సిట్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆధారాలివే
SIT Investigation In TSPSC Paper Leak Case: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… తమ వద్ద ఉన్న రహస్య సమాచారాన్ని సిట్ కు ఇచ్చామని చెప్పారు.
Revanth Reddy Attended The SIT Investigation: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా... పలువురికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... గురువారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... పలు వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు తమ వద్ద ఉన్న విలువైన సమాచారాన్ని సిట్ కు అందజేశామని చెప్పారు.
నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రూప్ 1తో పాటు ఇతర ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు చెప్పారు. వీటన్నింటికి మంత్రి కేటీఆర్ శాఖనే కారణమని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తో పాటు... టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగులను విచారించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 18వ తేదీన కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేవలం ఇద్దరికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం చేశారని... దీని వెనక ఉన్న పెద్దలను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకించామని పలు అంశాలను కూడా ప్రస్తావించామని అన్నారు. ఈ క్రమంలో తనకు సిట్ నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు.
"మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా మాకు నోటీసులు ఇవ్వటం దురదృష్టకరం. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ చెప్పిన ప్రతి విషయాన్ని క్రోడీకరించి... సిట్ కు అందజేశాం. కేటీఆర్ వద్ద పూర్తి సమాచారం అందని సిట్ కు వివరాలను తెలిపాం. కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తే... అన్నీ వాస్తవాలు బయటికి వస్తాయని సిట్ కు చెప్పాను. ఎవరి పాత్ర ఎంత అనేది కూడా కేటీఆర్ చెప్పారు. 2015లో కేటీఆర్... పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ కు వెళ్లారు. ఆరోజు కొత్త కంప్యూటర్లను అందిస్తామని చెప్పారు. అందులో భాగంగా పాత వాటిని తీసేసి... కొత్త వాటిని ఇచ్చారు. ఐటీ శాఖ పరిధిలో పని చేసే టీఎస్ టీఎస్ సంస్థనే వీటిని సమకూర్చింది. రాజశేఖర్ ను కూడా రిక్రూట్ చేసింది కూడా ఈ సంస్థనే. ఓవైపు అరెస్ట్ అయిన వారు.. కస్టడీలోకి రాకముందే కేటీఆర్ కీలక విషయాలను చెప్పారు. సిట్ కు నాయకత్వం వహిస్తున్న విజయవాడకు చెందిన ఏఆర్ శ్రీనివాస్సే 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరాను" అని చెప్పినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడారు.
పేపర్ లీక్ కేసు విషయంలో మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. ఈ కేసులో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారని… జరిగిన ఆర్థిక లావాదేవీలు బయటికి రావాలని కోరారు. నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి… కాబట్టి ఈ కేసును ఈడీ కూడా పర్యవేక్షించాలన్నారు. టీఎస్పీఎస్సీని ప్యానల్ ను రద్దు చేయటమే తమ పార్టీ డిమాండ్ అని చెప్పారు. తన వద్ద బలమైన సాక్ష్యమే కేటీఆర్ అని ఒక్క మాటలో క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
సంబంధిత కథనం