TSPSC Hacking : టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ కలకలం.. ఆ పరీక్షలు వాయిదా !
TSPSC Hacking : టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ అనుమానంతో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జామ్ తో పాటు మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, క్లాస్ బీ పరీక్షలను నియామక బోర్డు వాయిదా వేసింది. హ్యాకింగ్ పై పోలీసులకి ఫిర్యాదు చేసింది.
TSPSC Hacking : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో హ్యాకింక్ కలకలం రేగింది. అత్యున్నత ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నియామక పరీక్షలు నిర్వహిస్తోన్న టీఎస్పీఎస్సీలో... కంప్యూటర్ హాక్ అయిందన్న సమాచారం సంచలనంగా మారింది. పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ అయిందన్న అనుమానంతో టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను వాయిదా వేసింది. ఆదివారం (మార్చి 12న) జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జామ్ తో పాటు... మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, క్లాస్ బీ పరీక్షలను నియామక బోర్డు పోస్ట్ పోన్ చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. హ్యాకింగ్ పై పోలీసు కేసు నమోదు చేసినట్లు తెలిపింది.
టౌన్ ప్లానింగ్ బిల్డిండ్ ఓవర్సీర్ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో... వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్స్ ని కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన కీలక కంప్యూటర్ ను హ్యాక్ చేసి అందులోని సమాచారాన్ని తస్కరించినట్లు టీఎస్పీఎస్సీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో.. పరీక్షలను వాయిదా వేసిన నియామక బోర్డు.. హ్యాకింగ్ పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. కంప్యూటర్ ని హ్యాక్ చేసిన వారిని గుర్తించి.. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
పురపాలక శాఖ పరిధిలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గతేడాది సెప్టెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మార్చి 6 నుంచి పరీక్షల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ఓఎంఆర్ విధానంలో మార్చి 12న పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన టీఎస్పీఎస్సీ.. హ్యాకింగ్ అనుమానంతో పరీక్షను వాయిదా వేసింది.
పశుసంవర్థక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ - ఏ కింద 170 పోస్టులు... వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బీ కింద 15 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మార్చి 15, 16వ తేదీన నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 10 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. సీబీఆర్టీ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం టీఎఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందన్న అనుమానంతో ఈ పరీక్షలనూ వాయిదా వేసింది.
టీఎస్పీఎస్సీ వద్ద లక్షల మంది నిరుద్యోగుల సమాచారం ఉంది. ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు ఇతర శాఖల్లో ఖాళీల భర్తీ కోసం పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో కొన్నింటి పరీక్షలు పూర్తవగా.. మరికొన్ని పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ అనుమానంతో రెండు పరీక్షలు వాయిదా పడటంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లు కేవలం ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారమే చోరీ చేశారా లేక, ఇతర పరీక్షల వివరాలు, అభ్యర్థుల సమాచారం కూడా దొంగిలించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.