KTR Legal Notices: పేపర్ లీకేజ్ కేసు... ఆ ఇద్దరు నేతలకు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు -ktr sends legal notices to revanth reddy and bandi sanjay over paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /   Ktr Sends Legal Notices To Revanth Reddy And Bandi Sanjay Over Paper Leak Case

KTR Legal Notices: పేపర్ లీకేజ్ కేసు... ఆ ఇద్దరు నేతలకు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 10:04 PM IST

TSPSC Papers Leak Case Updates:బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు మంత్రి కేటీఆర్. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

KTR Sends legal notices to Revanth and Bandi Sanjay: టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విచారణ జరుగుతుండగా... మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మంత్రివర్గం నుంచి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. అంతేకాదు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ బండి సంజయ్, రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతో తనను లాగుతున్నారని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుజేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందని అన్నారు. అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ లు తెరలేపారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివితక్కువతనంతో వీరు అవాకులు చెవాకులు పేల్చుతున్నారు మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించనని హెచ్చరించారు.

గతంలో కోవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలివి తక్కువతనంలో రేవంత్ తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. టీఎస్ పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ర్పచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని కేటిఆర్ హెచ్చరించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని చెప్పారు. చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికైనా శవాలపైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయని మండిపడ్డారు.

తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ యువతకు పిలుపునిచ్చారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని... భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందన్నారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దని కోరారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం