TSPSC Online Exams: ఐబిపిఎస్ తరహాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు
TSPSC Online Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలకు కమిషన్ ఉపక్రమించింది. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల్ని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని యోచిస్తోంది.
TSPSC Online Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో మార్పులు తీసుకురావాలని కమిషన్ యోచిస్తోంది. పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేపట్టాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది.
పరీక్ష పత్రాల తయారీ, భద్రత, సాంకేతిక ఇబ్బందులు లేకుండా, పరీక్షలకు అవసరమైన ప్రశ్నలను పెద్ద సంఖ్యలో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నా విడతల వారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏ దశలోను పేపర్ లీక్ అనే వివాదం తలెత్తకుండా చూడాలని యోచిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు కూడా ఆన్లైన్ పరీక్షా విధానాన్ని విస్తరించనున్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని భావిస్తోంది. ప్రొఫెషనల్ పోస్టుల ఉద్యోగాలతో ప్రారంభించి, భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు…
ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ తయారు చేశారు. స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కమిషన్, ఐబీపీఎస్, ఇతర పీఎస్సీలతో పాటు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అయా కమిటీలు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులకు ఒకేరోజున పరీక్షలు నిర్వహించడం సవాళ్లతో కూడుకుంటోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజుల పాటు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి.
ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు వినియోగించుకుంటే 50వేల మంది వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు, విధానంపై ఇప్పటికే అభ్యర్థుల్లో అవగాహన ఉండటంతో అభ్యర్థులకు కష్టం కాదని భావిస్తోంది.
టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఏఎంవీఐ, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ తదితర పరీక్షలకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు. గ్రూపు సర్వీసుల ఉద్యోగాలకు ఈ విధానం అమలు చేయాలని గతంలోనే భావించినా నిరుద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని పాత విధానాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఓఎంఆర్ పద్ధతి అవలంబించినా, భవిష్యత్తులో నార్మలైజేషన్ ఆధారితంగా విడతల వారీగా పరీక్షలు పూర్తిచేసేలా నిబంధనలు సవరించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్