SIT Notices To Bandi Sanjay : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు-sit notices to bandi sanjay in tspsc paper leakage issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sit Notices To Bandi Sanjay In Tspsc Paper Leakage Issue

SIT Notices To Bandi Sanjay : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 08:16 PM IST

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంపై ఆరోపణలు చేస్తున్న నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది.

బండి సంజయ్
బండి సంజయ్

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్స్‌(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు(Bandi Sanjay) నోటీసులు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని తెలిపింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశం మీద బండి సంజయ్ కామెంట్స్ చేశారు. ఒకే ఊరిలో ఎక్కువ మందికి ర్యాంకులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల మీద ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage) ఘటనలో తమకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై బండి సంజయ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ఆరోపణలకు 24వ తేదీన తమ ఎదుట హాజరై ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసింది.

సంజయ్ చేసిన కామెంట్స్ ఇవే..

పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్(KTR) బాధ్యుడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 పేపర్(Group 1 Paper) లీకేజీలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయని తెలిపారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారని పేర్కొన్నారు. ఒకే మండలం నుంచి యాభై మందికిపైగా.. క్వాలిఫై అయ్యారని ఆరోపణలు చేశారు. ఓ చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. సీఎం కేసీఆర్(CM KCR) నియమించిన సిట్(SIT).. విచారణ ఎలా చేయగలదని అడిగారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

నిరుద్యోగ యువత నోటిలో మట్టి కొట్టి.. తన ఇంటికే ఐదు ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఇచ్చుకున్నారని బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడి.. 30 లక్షల మంది యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. 'గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తుంటే.. టీఎస్పీఎస్సీ స్కామ్(TSPSC Scam) అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోంది. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్(Group 1 Prelims) పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారు.' అని బండి సంజయ్ కామెంట్స్ చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి నోటీసులు జారీ చేసింది. 23వ తేదీన ఆధారాలు తీసుకుని రావాలని చెప్పింది. లీకేజీ వ్యవహారంపై కామెంట్స్ చేసిన మరికొంతమంది కూడా.. సిట్ నోటీసులు అందుకునే అవకాశం ఉంది.

IPL_Entry_Point