TSPSC Papers Leak Case: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరిన్ని క్వశ్చన్ పేపర్స్..! తీగ లాగుతున్న 'సిట్' -suspects downloaded 5 question papers in tspsc paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Papers Leak Case: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరిన్ని క్వశ్చన్ పేపర్స్..! తీగ లాగుతున్న 'సిట్'

TSPSC Papers Leak Case: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరిన్ని క్వశ్చన్ పేపర్స్..! తీగ లాగుతున్న 'సిట్'

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 09:29 PM IST

TSPSC Papers Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్… దాదాపు ఐదు ప్రశ్నాపత్రాలను సంపాదించినట్లు సిట్ విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు
పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు

TSPSC Papers Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ విచారణ వేగవంతం చేయటంతో... కీలక సమాచారం బయటికి వస్తోంది. ఇప్పటి వరకు ఏఈ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందని గుర్తించగా.... సిట్‌ విచారణలో ప్రవీణ్‌ అక్రమాలు మరిన్ని బయటకు వచ్చినట్లు సమాచారం.

ప్రవీణ్ పెన్ డ్రైవ్ ను సీజ్ చేసిన పోలీసులు... ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించి విశ్లేషించారు. అయితే ఇందులో కేవలం ఏఈ పరీక్షా పత్రం కాకుండా... టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక కేవలం ప్రవీణ్ పెన డ్రైవ్ మాత్రమే కాకుండా... ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితుల ఫోన్లను కూడా పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించారు. మరోవైపు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... నిందితులు గత కొంతకాలంగా ప్రధానంగా ఎవరితో మాట్లాడారన్న విషయాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేస్తారని సమాచారం.

సూత్రదారి ప్రవీణ్.. పాత్రదారి రేణుక..!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల కొనుగోలు కోసం తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేణుక తమ్ముడికి ఏఈ పరీక్షకు హాజరయ్యే అర్హత లేకపోయినా అతని పేరుతో ప్రశ్నాపత్రాల కోసం ప్రయత్నించినట్లు తేల్చారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వద్ద సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ నుంచి ప్రశ్నాపత్రాలు సేకరించి వాటిని విక్రయించేందుకు అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో రేణుక బేరం కుదుర్చుకుంది. టీటీసీ చదివిన రాజేశ్వర్‌ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు కావాల్సిన విద్యార్హత అతనికి లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్‌తో చెప్పింది. అదే సమయంలో ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌ నాయక్‌లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్‌ తన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు.

రాజమండ్రిలో ఉన్న తన బాబాయికి ప్రవీణ్‌ రూ.3.5 లక్షలు ఆన్‌లైన్‌లో పంపినట్టు పోలీసులు గుర్తించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్‌ డబ్బు ఆశ చూపించి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో అతనికి కొంత ఇస్తానని చెప్పాడు. ఈలోపే పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో రాజశేఖర్‌కు సొమ్ము అందలేదని పోలీసులు గుర్తించారు.

ఇక పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌తల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్‌ 2020లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఎస్సై ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మెయిన్స్‌కు పరీక్షకు సిద్ధమవుతూ ఫిబ్రవరి 1 నుంచి సెలవులో ఉన్నాడు. ప్రశ్నపత్రాలు విక్రయిస్తానంటూ రేణుక ఫోన్‌ చేసినప్పుడు తనకు అవసరం లేదని చెప్పాడు. ఏఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థుల సమాచారం సేకరించి ఆమెకు ఇచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఉంటూ ప్రశ్నాపత్రాల లీకేజీ సమాచారం తెలిసినా ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా తీసుకున్నారు. శ్రీనివాస్ వ్యవహారంపై సీపీ కార్యాలయానికి నివేదిక పంపినట్టు మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నపత్రాలు లీకైనట్లు తెలియగానే టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి వచ్చే సిబ్బంది వివరాలను అధికారులు సేకరించారు. కంప్యూటర్లు, ల్యాన్‌ ఉన్న గదుల్లోకి ప్రవీణ్‌కుమార్‌ వచ్చినట్టు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో ఉండే ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకునేందుకు ప్రవీణ్ ఆసక్తి చూపేవాడని, రహస్య వివరాలపై తమతో చర్చించాడని ఓ ఉద్యోగి పోలీసులకు తెలిపాడు. అతనిపైనే అనుమానాలున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కమిషన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ప్రవీణ్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం బయట పడింది.

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రేణుక 2018లో టీజీటీ హిందీ పోస్టుకు రేణుక ఎంపికైంది. వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామ పరిధిలోని బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే రోజు వరకు రేణుక మొత్తం 16 రోజులు సెలవు పెట్టినట్లు గుర్తించారు. జనవరిలో 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరిలో 1వ తేదీ, 4 నుంచి 8 వరకు, 24న సెలవు పెట్టింది. మార్చి 4, 5 తేదీల్లో ఏఈ పరీక్ష జరిగినపుడు కూడా సెలవు తీసుకుంది. తన బాబుకు బాగా లేదని, సెలవు కావాలంటూ ప్రిన్సిపల్‌కు 4న అర్ధరాత్రి ఒంటి గంటకు వాట్సప్‌ మెసేజ్‌ పెట్టింది. 5న సీవోఈ ప్రవేశపరీక్షకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించేందుకు రావాలని కోరినా రాలేదని తెలిసింది. తమ మరిది చనిపోయారని, మూడు రోజుల సెలవులు కావాలని 10న వాట్సప్‌ ద్వారా కోరింది. దీంతో ప్రిన్సిపల్‌ 10, 11, 12 తేదీలను సెలవుగా మార్కు చేశారు.

మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సెలవులో ఉన్నారని సిబ్బంది భావించారు. అదేరోజు సాయంత్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టుల రాతపరీక్ష ఈ నెల 12న జరగాల్సి ఉంది. మార్చి 10, 11, 12, 13 తేదీల్లో కూడా ఆమె సెలవులు పెట్టడాన్ని గుర్తించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రేణుకను సస్పెండ్‌ చేయనున్నట్లు గురుకుల సొసైటీ వర్గాలు వెల్లడించాయి.

Whats_app_banner

సంబంధిత కథనం