AP TS MLC Elections Results 2023: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు... ఆసక్తికరంగా టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు..!
MLC Elections Results 2023 Updates: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గురువారం ఉదయం 8గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలైంది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
AP and Telangana MLC Elections Results: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఫలితాలు రాగా... మరికొన్నింటిని లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సత్తా చాటగా... తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇక్కడ ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
స్థానిక సంస్థల్లో వైసీపీ హవా...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ హవా కొనసాగింది. పోటీ జరిగిన అన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు దక్కాయి. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌రావు విక్టరీ కొట్టారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 636 ఓట్లు రాగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లు దక్కాయి. అనంతపురం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు ఇలా…
ఇక ఏపీ, తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీలో 2 స్థానాల్లో, తెలంగాణలో ఒక్క స్థానంలో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్లో మొదటి రౌండు ఫలితాలు వెల్లడయ్యాయి. 1213 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఎం వి రామచంద్రారెడ్డి ఉన్నారు. మొదటి రౌండ్లో రామచంద్ర రెడ్డికి 4756 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వంటేరు శ్రీనివాస్ రెడ్డికి 3543 ఓట్లు వచ్చాయి. పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 2500తో మూడో స్థానంలో ఉన్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో వైసీపీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ 7 వేల ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థికి 3079 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించగా.. పీడీఎఫ్ అభ్యర్థి బాబు రెడ్డికి 2522 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్సీ రమణా రెడ్డికి 847 ఓట్లు వచ్చాయి.
ఇక తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు లెక్కింపు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ మద్దతు ఇచ్చిన ఎవీఎన్ రెడ్డి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి 7,505 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మాణిక్ రెడ్డి 4569 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తుది ఫలితం రేపు ఉదయం వరకు రావొచ్చని తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే నాటికి నాలుగు నామినేషన్లు దాఖలు కాగా.. అందులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పాలమూరి కమల నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఫలితంగా ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే రేసులో ఉండటంతో వారు ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మొత్తంగా చూస్తే... ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని ఏపీ హైకోర్టు బుధవారం పేర్కొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపును యథాతథంగా నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది. అయితే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘ ప్రక్రియ.. అయితే ఈ ఫలితాల ప్రకటనకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.