TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. సిట్​కు బదిలీ-tspsc paper leak 14 days custody for accused in ae exam paper leakage case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Paper Leak 14 Days Custody For Accused In Ae Exam Paper Leakage Case

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. సిట్​కు బదిలీ

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 07:03 PM IST

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో తొమ్మిది నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా.. అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ లీకైందని గుర్తించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ (tspsc.in)

టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. దీనికంటే ముందుగా.. 9 మంది నిందితులను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఈ కేసును సిట్ కు బదిలీ చేస్తూ.. సీపీ ఆదేశాలు ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ గతంలో జరిగిన ప్రిన్సిపల్ పోస్టులకు(Principal Posts) సంబంధించి.. ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం.. రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి.. జాబ్స్ ఇప్పించాడని వార్తలు ఉన్నాయి.

ఇంకోవైపు పేపర్ లీక్(Paper Leak) వ్యవహారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లిలోనీ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని(TSPSC Office) అభ్యర్థులు, బీఎస్పీ నేతలు, విద్యార్థి సంఘాలు ముట్టడికి ప్రయత్నించాయి. పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు టీఎస్పీఎస్పీ ఆఫీసు వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను అడ్డుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్పీ(TSPSC)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఉపాధ్యాయురాలు రేణుకతో స్నేహం ఉంది. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్(Assistant Engineer) పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కావాలని రేణుక ప్రవీణ్ ను అడిగింది. భర్త ఢాక్యా నాయక్ తో కలిసి డీల్ చేసిన రేణుక... రూ. 10 లక్షలు ఇస్తామని ప్రవీణ్ కి చెప్పింది. దీంతో.. అతడు టీఎస్పీఎస్సీలో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్ వర్డ్ ని తస్కరించారు. టీఎస్పీఎస్సీలో అన్ని కంప్యూటర్లు ఒకే ల్యాన్ కింద కనెక్ట్ అయి ఉండటంతో.. సర్వర్ లో పాస్ వర్డ్ టైప్ చేసి ప్రశ్నపత్రాలు యాక్సెస్ చేశారు. ఆ తర్వాత వాటిని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్న ప్రవీణ్.... రేణుకకి ఇచ్చాడు. ఆమె నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు.

రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్... అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులతో డీల్ సెట్ చేసేందుకు సహకరించాడు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ని సంప్రదించారు. డబ్బులు చెల్లించి పేపర్ తీసుకునేందుకు నిరాకరించిన శ్రీనివాస్... తనకు తెలిసిన వారితో డీల్ కుదిరేలా చేశాడు. ఈ క్రమంలోనే దినేశ్ నాయక్ , గోపాల్ నాయక్ సహా మరో ఇద్దరు అభ్యర్థులకి పేపర్ ఇచ్చారు. ఇలా రూ. 13.5 లక్షలు సేకరించారు. వీరందరూ రేణుక ఇంట్లోనే ప్రశ్నలపై అధ్యయనం చేసి సమాధానాలు సేకరించారు. అనంతరం మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష(Exam)కు హాజరయ్యారు. ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పూర్తవడంతో.. ఇదే పంథాలో టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా ఇంటి దొంగలు లీక్ చేసినట్లు సమాచారం.

మార్చి 11న టీఎస్‌పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయాలన్నీ గుర్తించామని పోలీసులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించి పేపర్లు లీక్ అయ్యాయన్న అనుమానంతో టీఎస్పీఎస్సీ ఫిర్యాదు చేయగా... తాము దర్యాప్తు చేశామని, ఈ క్రమంలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని గుర్తించామని చెప్పారు. ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నామని... గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

WhatsApp channel