Nampally Fire Accident : నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం.. 4 కార్లు దగ్ధం
Nampally Fire Accident : హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 4 కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేసింది.
Nampally Fire Accident : హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ లోని పార్కింగ్ ప్రదేశంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మిగతా కార్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నుమాయిష్ ప్రదర్శన జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంటో.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతుందో చూసేందుకు అధిక సంఖ్యలో జనం గుమిగూడటంతో... నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పార్కింగ్ లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనాలు పక్క పక్కనే పార్క్ చేసి ఉంచడంతో... ఎలక్ట్రిక్ కారులో చెలరేగిన మంటలు... పక్కన ఉన్నకార్లకు వ్యాపించాయి. చూస్తుండగానే.. మొత్తం నాలుగు కార్లు మంటల్లో పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేశారు. స్తంభించిన ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేశారు.
వీకెండ్ కావటంతో... నుమాయిష్ వద్ద విపరీతమైన రద్దీ ఉంది. చాలా మంది కుటుంబాలతో కలిసి ప్రదర్శన తిలకించేందుకు తరలివచ్చారు. సాధారణంగా... ప్రతి రోజు నుమాయిష్ కి సాయంత్రం వేళల్లో జనం తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ రోజు శనివారం కావటంతో.. అధిక సంఖ్యలో నగరవాసులు పారిశ్రామిక ప్రదర్శన సందర్శనకు వచ్చారు. అంతా ఉత్సాహంగా సాగుతోన్న సమయంలో... ఒక్కసారిగా బయట మంటలు చెలరేగటంతో.. సందర్శకులు కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక కొద్ది సేపు అయోమయానికి గురయ్యారు. అగ్నమాపక పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొని.. మంటలు ఆర్పివేయడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్కింగ్ స్థలంలో చాలా కార్లు ఉన్నాయి. మంటలు మిగతా కార్లకు కూడా వ్యాపిస్తే.. భారీ నష్టం జరిగి ఉండేది.
మరోవైపు.. హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు.. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట మినిస్టర్ రోడ్డులోని డెక్కన్ కార్పొరేషన్ వ్యాపార సముదాయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు కనిపించకుండా పోయారు. అయితే ఇవాళ ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. స్థానికులతో మాట్లాడారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని కూల్చివేస్తామని స్థానికులకు భరోసా కల్పించారు.