Airport Metro : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో.. సవాళ్లపై ఇంజినీర్ల అధ్యయనం-hyd metro md nvs reddy and engineers inspects airport metro route ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyd Metro Md Nvs Reddy And Engineers Inspects Airport Metro Route

Airport Metro : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో.. సవాళ్లపై ఇంజినీర్ల అధ్యయనం

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 04:38 PM IST

Airport Metro : శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రూట్ మ్యాప్ ను ఇంజినీర్లు పరిశీలించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు పలు జంక్షన్లలో ఎదురయ్యే ఇబ్బందులు... వాటికి పరిష్కార మార్గాలపై అధ్యయనం జరిపారు.

మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

Airport Metro : నిర్మాణ రంగానికే తలమానికం... హైదరాబాద్ మెట్రో. నిత్యం వేలాది వాహనాలు పయనించే రహదారి మధ్యన స్టేషన్లు.. ఎస్కలేటర్లు.. లిఫ్టులు.. షాపింగ్ మాల్స్.. ఫ్లైఓవర్లు.. ఆర్వోబీలు దాటిపోతూ సాగిపోయే ట్రాక్. ఇలా.. అనేక ఇంజినీరింగ్ అద్భుతాలను హైదరాబాద్ మెట్రో ఆవిష్కరించింది. సికింద్రాబాద్ స్టేషన్ కు సమీపంలో నిర్మించిన ఒలిఫెంటా స్టీల్ బ్రిడ్జి.. ఇంజినీరింగ్ మార్వెల్ గా గుర్తింపు పొందింది. ఇలా అనేక ఘనతలు లిఖించిన హైదరాబాద్ మెట్రో... మరిన్ని టెక్నికల్ వండర్స్ నమోదు చేసేందుకు సమాయత్తం అవుతోంది. అనేక సవాళ్లను అధిగమించి... శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రూట్ ను నిర్మించేందుకు కసరత్తు మొదలు పెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు ఎయిర్ పోర్ట్ మెట్రోకు.. గతేడాది డిసెంబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోన్న అధికారులు.. మెట్రో రూట్ మ్యాప్ ను శనివారం (ఫిబ్రవరి 18న) పరిశీలించారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సహా పలువురు ఇంజినీర్లు... ఈ రూట్ లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేశారు. రాయదుర్గం స్టేషన్, నానక్ రామ్ గూడ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద అవకాశం ఉన్న నిర్మాణాలపై పరిశీలన జరిపారు.

ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణంలో పలు సవాళ్లు ఎదురవుతాయని.. సమగ్ర అధ్యయనం, పరిశీలనతో వాటిని అధిగమిస్తూ నిర్మాణాలు చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం స్టేషన్ - నానక్ రామ్ గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గమన్న ఆయన... అత్యుత్తమైన ఇంజినీరింగ్ పరిష్కారం కోసం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం పెద్ద సవాల్ అని.... మైండ్ స్పేస్ జంక్షన్ లో అండర్ పాస్, మధ్య రోటరీ, పైన ఫ్లై ఓవర్ ఉన్నాయని పేర్కొన్నారు. మూడు అడ్డంకులు దాటేందుకు ప్రత్యేక స్పాన్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో పిల్లర్లను ఫై ఓవర్ పిల్లర్లకు దూరంగా నిర్మించాలని పేర్కొన్నారు.

రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు ఎయిర్ పోర్ట్ మెట్రోను... రూ. 6,250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రోరైలు రెండవ దశ పూర్తి కానుంది. మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 26నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మెట్రో కారిడార్‌లోనే విమానాశ్రయ ప్రయాణాలకు చెక్‌ ఇన్‌ చేసుకోవచ్చు. తద్వారా విమానాశ్రయాల్లో రద్దీని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో(Air Port Express Way) మూడేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరో 31 కిలో మీటర్ల పనులపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించామని.... బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ 26 కిలోమీటర్లు...... నాగోల్ నుంచి ఎల్బీనగర్ 5 కిలోమీటర్లకు మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్ ఇచ్చామని తెలిపారు.

IPL_Entry_Point