పదో తరగతి పేపర్‌ లీక్‌ వట్టిదే.....-botcha denies paper leak or mass copyig
Telugu News  /  Andhra Pradesh  /  Botcha Denies Paper Leak Or Mass Copyig
పదో తరగతి పేపర్ లీక్‌ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నమంత్రి బొత్స
పదో తరగతి పేపర్ లీక్‌ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నమంత్రి బొత్స

పదో తరగతి పేపర్‌ లీక్‌ వట్టిదే.....

29 April 2022, 6:09 ISTHT Telugu Desk
29 April 2022, 6:09 IST

ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలలో పేపర్ లీకేజ్, మాల్ ప్రాక్టీస్ జరగలేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వంపై దుష్ర్పచారం చేసేందుకే కొంతమంది పేపర్ లీక్‌ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాక తెలుగు, హిందీ పేపర్లు లీక్ అంటూ వస్తున్న వార్తల్ని మంత్రి బొత్స ఖండించారు. 10 వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు , తీసుకున్న చర్యల్ని మంత్రి వివరించారు . ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి మే 6 వ తేదీ వరకు 10 వ తరగతి పరీక్షల నిర్వహణ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, పత్రిరోజు ఉదయం 9. 30 గంటల నుంచి 12. 30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు . వివిధ కారణాల వల్ల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను 10 గంటల వరకు అనుమతిస్తారని మంత్రి చెప్పారు.

నంద్యాలలో జరిగిన ఘటనలో పేపర్ లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని లేదన్నారు . స్కూల్లో పనిచేసే క్లర్క్ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చిన తర్వాత దుష్ట ఆలోచనతో , కొందరి ప్రమేయం తో 10 గంటల తర్వాత ఫొటోలు తీసి టీచర్ల కు అందించారని , దీనిపై వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని, దీని వలన ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం నిరోధించగలిగిందని మంత్రి అన్నారు. ఈ ఘటనలో పేపర్ లీకేజ్ లేదా మాల్ ప్రాక్టీస్ గాని జరగలేదన్నారు . ఈ సంఘటన పై ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ విచారణ కు ఆదేశించిందని , ఇందుకు బాధ్యులైన ఇద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. 9 మంది ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుందన్నారు.

గురువారం శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజ్ అయినట్లుగా కొన్ని ఛానళ్ల లో స్క్రోలింగ్ వేశారని, దీనిపై కలెక్టర్, ఎస్పీ, డీఈవో విచారణ చేపట్టారని, ఎటువంటి పేపర్ లీకేజ్ కాలేదని నిర్ధారించారన్నారు. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలు , కొన్ని టీవీ ఛానళ్ల పట్ల ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు . నంద్యాల లో హైస్కూల్ లో జరిగిన సంఘటన కు సంబంధించి నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ , ఎన్నారై కి విద్యాసంస్థకు చెందిన టీచర్ సుధాకర్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని మరో 9 మంది టీచర్ల ను పోలీసులు విచారిస్తున్నారని మంత్రి చెప్పారు.

10 వ తరగతి పరీక్షల నిర్వహణ కు సంబంధించి 10 రోజుల ముందు నుండే విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు . గత సంవత్సరం పరీక్షల నిర్వహణ లో ఎటువంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయని సమీక్షించి అందుకు అనుగుణంగా ఈ సంవత్సరం పరీక్షల నిర్వహణ లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం పై ఈ పత్రికలు , టీవీ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, దీని వల్ల వారికి లాభమేంటని మంత్రి అన్నారు . ఆన్సర్ షీట్లు కిళ్లీ కోట్లలో , టీ షాపుల్లోనూ దొరుకుతున్నాయని కొన్ని టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని ఇటువంటి అసత్య ప్రచారం చేయడం ద్వారా పరీక్షలు రాస్తున్నవిద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురవుతున్నారన్నారు. పరీక్ష రాసే ప్రతి విద్యార్థికి 24 పేజీల ఆన్సర్ షీట్ అందిస్తున్నామని , అటువంటి ఆన్సర్ షీట్లు బయట దొరుకుతాయని ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

మరోవైపు పదో తరగతి పరీక్షల విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వద్ద మొబైల్స్ ఉండకూడదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్విజిలేషన్‌ విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు మొబైల్స్‌ ఫోన్స్ ఎగ్జామ్ సూపరింటెండెంట్‌ వద్దే ఉంచాలని, ఎవరైనా మొబైల్ ఫోన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

టాపిక్