Minister KTR On TSPSC Paper Leak Case: పేపర్ లీక్ విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రగతి భవన్ లో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత... మంత్రులు మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... వ్యవస్థ సరిగా పని చేస్తోందని చెప్పారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని చెప్పిన ఆయన.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని తెలిపారు.,రద్దు అయిన నాలుగు పరీక్షల మెటీరియల్ ను పూర్తిగా ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు." 8 ఏళ్లోలో టీఎస్పీఎస్సీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. మన సంస్కరణలను కూడా యూపీఎస్సీ అధ్యయనం చేసింది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ నియమాకాలను చేపట్టాం. అవకతవకలకు అవకాశం ఉండొద్దనే ఇంటర్వూలను రద్దు చేశాం. పొరపాటును సరిదిద్దే బాధ్యత మాపై ఉంది. మార్పులు తీసుకొచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. రద్దు అయిన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న వారంతా అర్హులు అవుతారు. ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. నిందుతుల్లో ఒకరైన రాజశేఖర్... బీజేపీలో క్రియాశీలకంగా పని చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీని కోరుతున్నాం. పేపర్ లీక్ అంశం వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనేది తేలాల్సిన అవసరం ఉంది" అని కేటీఆర్ తెలిపారు.,,పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి సీఎంకు నివేదిక అందజేశామని చెప్పారు మంత్రి కేటీఆర్. రీడింగ్ హాల్స్ వద్ద భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే పరీక్షలు రాసి అర్హత సాధించినవారు బాధపడుతున్నారని... వారి బాధను అర్థం చేసుకుంటున్నామని చెప్పారు. అయితే లీక్ అయినట్లు తెలుస్తున్న నేపథ్యంలో...పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు. అనుమానాలకు తెరదించాలనే ఉద్దేశ్యంతోనే పరీక్షలను రద్దు చేశామన్నారు. ప్రభుత్వ చర్యలను అభ్యర్థులు అర్థం చేసుకోవాలని కోరారు. అపోహాలు, దుష్ప్రచారాలను నమ్మవద్దని కేటీఆర్ కోరారు.,