Supreme Notices Centre : గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు-supreme notices to centre over pending bills at telangana governor
Telugu News  /  Telangana  /  Supreme Notices To Centre Over Pending Bills At Telangana Governor
సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

Supreme Notices Centre : గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

21 March 2023, 17:02 ISTHT Telugu Desk
21 March 2023, 17:02 IST

Telangana Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) దగ్గర ఉన్న.. పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టు(Supreme Court) విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) తీసుకొచ్చిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్ లో ఉంచారు. అయితే వాటి మీద ఎప్పటి నుంచో చర్చ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో బిల్లులను ఆమోదించేలా.. ఆదేశాలు ఇవ్వాలంటూ... తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దీనిమీద సుప్రీం కోర్టు(Supreme Court) విచారణ చేసింది. ఈ సందర్భంగా.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ లో గవర్నర్ తోపాటుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆలస్యం ఎందుకు అవుతుందని, వివరణ కోరుతూ.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా.. కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలగజేసుకుని.. తెలంగాణ గవర్నర్(Telangana Governor) నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బదులిస్తామని కోర్టుకు చెప్పారు. అయినా సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 27వ తేదీన సోమవారం ఈ పిటిషన్ మీద విచారణ జరగనుంది.

రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం ఉభయ సభలు ఆమోదించిన.. బిల్లులకు గవర్నర్ ముద్ర వేయాల్సి ఉంటుంది. అలా జరిగాక.. వాటి అమలుకు వీలు ఉంటుంది. అయితే ఈ క్రమంలో పది బిల్లులు పంపితే.. తిరస్కరించడమో.. లేక సూచనలు చేయడమో జరగాలి. లేదంటే.. వెనక్కి పంపడమో చేయాలని.. కానీ గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం మెట్లు ఎక్కింది.

బిల్లులేంటి..?

గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదం పొందాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటి ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్‌ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్‌ ఆమోదం లభించింది. మిగిలిన బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ఫైల్స్ అన్ని ప్రస్తుతం రాజ్ భవన్ పెండింగ్ లోనే ఉన్నాయి.