Live-in-Relationships: ‘సహజీవనానికి రిజిస్ట్రేషన్’ పిటిషన్‍పై సుప్రీం కోర్టు నిర్ణయమిదే! సీజేఐ ఆగ్రహం
Live-in-Relationships: సహజీవనంలో ఉన్న జంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకురావాలని దాఖలైన పిల్‍పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు.
Live-in-Relationships Registration Petition: లివ్-ఇన్-రిలేషన్‍షిప్ (సహజీవనం)లో ఉన్న జంటల కోసం రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకురావాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీంకోర్టు (Supreme Court) నేడు విచారణ జరిపింది. సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‍పై వాదనలు వినింది. అనంతరం ఈ పిటిషన్‍ను ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసుకొస్తే సహజీవనం వల్ల జరుగుతున్న నేరాలను తగ్గించవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు.
ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలి?: సీజేఐ అసహనం
Supreme Court on Live-in-Relationships: ఇదో అసంబద్ధమైన పిటిషన్ అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. “ఏంటిది? ఏ అంశంతోనైనా ఇక్కడికి వస్తారు. ఇలాంటి కేసులపై మేం సమయాన్ని వృథా చేసుకోవడం ప్రారంభించాలి. ఎవరితో రిజిస్ట్రేషన్ చేయాలి? కేంద్ర ప్రభుత్వంతోనా? లివ్-ఇన్ రిలేషన్‍షిప్‍ల్లో ఉన్న వారితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?” అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
అర్థం లేని ఆలోచన
“లివిన్ రిలేషన్‍షిప్‍లో ఉన్న వారికి మీరు రక్షణ కల్పించాలనుకుంటున్నారా లేకపోతే ప్రజలు లివ్-ఇన్ రిలేషన్‍లో ఉండకూడదని చెబుతున్నారా? ఇలాంటి పిటిషన్లపై తగిన మూల్యం విధించాలి. ఇదో అర్థం ఆలోచన.. కొట్టేస్తున్నాం” అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వమే సహజీవనంలో ఉన్న జంటల రిజిస్ట్రేషన్ చేయాలని పిటిషనర్.. న్యాయస్థానానికి తెలిపారు. “దేని ఆధారంగా రక్షణ కల్పించాలని మీరు కోరుతున్నారు” అని సీజేఐ ప్రశ్నించారు. సామాజిక భద్రత అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది తడబడ్డారు.
లివ్-ఇన్-రిలేషన్‍లో ఉన్న వారిలో ఈ మధ్య నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ముఖ్యంగా శ్రద్ధా వాకర్ కేసు (Shradha Walker Case) దేశవ్యాప్తంగా సంచలనమైంది. లివ్-ఇన్-పార్ట్‌నర్‌గా ఉన్న శ్రద్ధను అఫ్తాబ్ పునావాలా గతేడాది మేలో అత్యంత కిరాతకంగా చంపాడు. అనంతరం శరీరాన్ని 35 భాగాలుగా నరికి, వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మరికొన్ని భాగాలను ఫ్రిడ్జిలోనే దాచాడు. ఈ దారుణ ఘటన గత నవంబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో అనేక సంచలన విషయాలు, ఆశ్చర్యపరిచే నిజాలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులోని అఫ్తాబ్ ఉన్నాడు. 6వేలకుపైగా పేజీలతో శ్రద్ధా హత్య కేసు చార్జిషీట్‍ను పోలీసులు దాఖలు చేశారు.