Governor Vs TS Govt : ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర.. పెండింగ్ బిల్లుల వివాదంపై గవర్నర్ ట్వీట్
Governor Vs TS Govt : రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయిండంపై... గవర్నర్ తమిళిసై స్పందించారు. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గర అని పేర్కొన్న గవర్నర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు.
Governor Vs TS Govt : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పంచాయితీ కొనసాగుతోంది. ఇటీవలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో వివాదాం సమసిపోయిందని అనుకుంటున్న వేళ.. పెండింగ్ బిల్లుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. రాజ్ భవన్ తీరుని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. గురువారం (మార్చి 2న) సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 10 బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయని... 5 నెలలైనా ఆమోదించడం లేదని... అభ్యంతరాలతో వాపసూ కూడా పంపలేదని పేర్కొంటూ.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు.
పెండింగ్ బిల్లుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అడుగు సంచలనంగా మారగా... ఈ పరిణామాలపై గవర్నర్ తమిళి సై స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతి కుమారి కి అధికారికంగా రాజ్ భవన్ కు వచ్చేందుకు సమయం దొరకలేదా అని ప్రశ్నించిన గవర్నర్... ఢిల్లీ కన్నా హైదరాబాద్ లోని రాజ్ భవన్ చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ పాటించలేదని.. కనీస మర్యాద ఫాలో కాలేదని అన్నారు. స్నేహపూర్వక సమావేశాలు ఉపయోగకరంగా ఉండేవని... కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ దిశగా కనీస ఆలోచన చేయలేదని గవర్నర్ తమిళి సై దుయ్యబట్టారు. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గరనే విషయం మరోసారి తెలంగాణ సీఎస్ కి గుర్తు చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు.
బిల్లులేంటి..?
గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటున్న 10 బిల్లులు ఇవే..
1. అజమాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు - 2012
2. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు
3. పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్ట సవరణ బిల్లు
4. అటవీ యూనివర్సిటీ బిల్లు
5. యూనివర్సిటీల్లో ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
6. మోటర్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు
7. ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు
8. వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు
9. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు
10. మున్సిపల్ చట్టసవరణ బిల్లు
శాసన సభలో ఆమోదం పొందిన ఈ 10 బిల్లులపై తెలంగాణ గవర్నర్ ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదని.. దీని వల్ల ఏర్పడిన రాజ్యాంగ ప్రతిష్టంభన దృష్ట్యా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 163 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సహాయం, సలహాలోతో మాత్రమే గవర్నర్ విధులు నిర్వహించాల్సి ఉంటుందని... గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు లేదంది. షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందంది. ఆయా బిల్లులపై ఎప్పటికప్పుడు మంత్రులు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తగిన వివరణలు కూడా ఇచ్చారని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ కూడా ఇచ్చారని పేర్కొంది. కానీ.. ఇంకా బిల్లులని పెండింగ్ లోనే ఉంచారని .. వాటిని ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో... పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.