Governor Vs Government: ఆ బిల్లులకు ఆమోదముద్ర పడుతుందా..?-what will the governor do about the key bills sent by the telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Will The Governor Do About The Key Bills Sent By The Telangana Assembly

Governor Vs Government: ఆ బిల్లులకు ఆమోదముద్ర పడుతుందా..?

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 09:02 AM IST

Governor Vs Government: కొద్దిరోజుల కిందట తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదం పొందిన 8 బిల్లుల్లో కేవలం ఒక్క బిల్లుకు మాత్రమే ఆమోదం లభించింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు మాత్రమే చట్టరూపం దాల్చగా... మరో 7 బిల్లులు రాజ్‌భవన్‌లోనే పెండింగులో ఉండటం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా గణతంత్ర వేడుకల వివాదం తలెత్తిన నేపథ్యంలో… ఈ బిల్లుల అంశం మరోసారి తెరపైకి వస్తోంది.

గవర్నర్ తమిళిసై - ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో)
గవర్నర్ తమిళిసై - ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో) (facebook)

Raj bhavan Vs Pragati bhavan: రాజ్ భవన్... ప్రగతి భవన్..... గత కొద్దిరోజులుగా చర్చ అంతా దీని చుట్టే నడుస్తోంది! ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వంపై సూటిగా విమర్శలు గుప్పిస్తున్నారు గవర్నర్ తమిళిసై..! ఇదిలా ఉండగానే తాజాగా గణతంత్ర వేడుకల వేళ పెద్ద వివాదమే మొదలైంది. రాజ్ భవన్ వేదికగా జరిగిన వేడుకలకు సీఎం హాజరుకాలేదు. పైగా మంత్రులు కూడా రాలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్… బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు కూడా… గవర్నర్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ పంపిన బిల్లులను ఆమోదించకుండా… ఎందుకు దగ్గర పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సర్కార్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో… పెండింగ్ బిల్లుల ఆమోదం విషయంలో మరోసారి తెరపైకి వస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

బిల్లులేంటి..?

కొద్దిరోజుల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో ఎనిమిది బిల్లులు ఆమోదం పొందాయి. అందులో రెండు కొత్తవి ఉన్నాయి. మిగతా 6 చట్ట సవరణకు సంబంధించినవి ఉన్నాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటి ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్‌ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ఎనిమిది బిల్లులకుగాను ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్‌ ఆమోదం లభించింది. మిగిలిన 7 బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ఫైల్స్ అన్ని ప్రస్తుతం రాజ్ భవన్ పెండింగ్ లోనే ఉన్నాయి.

కీలకమైన బిల్లు ఇదే...

రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లుల్లో కీలకమైనది వర్శిటీల్లో నియమాకాలకు సంబంధించనది. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేస్తే... సంబంధిత ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అనూహ్యంగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు. పైగా ఈ బిల్లుకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని... క్లారిటీ ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యాశాఖమంత్రికి లేఖ రాశారు. ఈ పరిణామాలపై అధికార బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కీలకమైన నియమాకాలకు సంబంధించిన బిల్లును ఆపడమేంటని ప్రశ్నిస్తోంది. కావాలనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై గవర్నర్ కూడా స్పందించారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ్టికి ఆ బిల్లుల సంగతి అలాగే ఉంది.

నిజానికి కొంత కాలంగా రెండు ప్రధాన రాజ్యాంగ వ్యవస్థల మధ్య క్రమంగా దూరం పెరుగుతున్న వేళ... తాజాగా గణతంత్ర వేడుకల వివాదం మరింత గ్యాప్ ను పెంచినట్లు అయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గవర్నర్ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని అగౌవరపరించారంటూ సూటిగానే విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వంలోని వ్యక్తుల నుంచి డైలాగ్ లు పేలుతున్నాయి. బీజేపీ డైరెక్షన్ లో గవర్నర్ పని చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలతో పాటు మంత్రులు స్పందిస్తున్నారు. కీలకమైన వర్శిటీల్లో నియామకాల బిల్లును తొక్కిపెట్టారని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య మరింత దూరం పెరిగినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లుల విషయంలో గవర్నర్ ఏం చేస్తారు..? ఆమోదముద్ర వేస్తారా..? లేక తిప్పి పంపుతారా..? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం