TS Assembly: 8 బిల్లులు, ఒక్కదానికే గవర్నర్ ఆమోదం..! మరో వివాదం కాబోతుందా..?
గత నెలలో రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదం పొందిన 8 బిల్లుల్లో కేవలం ఒక్క బిల్లుకు మాత్రమే ఆమోదం లభించింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు మాత్రమే చట్టరూపం దాల్చగా... మరో 7 బిల్లులు రాజ్‌భవన్‌లోనే పెండింగులో ఉన్నాయి.
assembly bills pending at rajbhavan: రాజ్ భవన్... ప్రగతి భవన్..... గత కొద్దిరోజుల కిందట చర్చ అంతా దీని చుట్టే...! ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వంపై సూటిగా విమర్శలు గుప్పిస్తున్నారు గవర్నర్ తమిళిసై..! వరదల విషయంలోనూ ముఖ్యమంత్రి ఓవైపు... గవర్నర్ మరోవైపు పర్యటనలు కూడా చేశారు. చాలారోజులుగా ఇరువురి మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే జరిగిన పరిణామాలు కూడా వాటిని బలపరిచాయి. తాజాగా మరో అంశం తెరపైకి వస్తోంది.
గత నెలలో రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు జరిగాయి. ఇందులో 8 బిల్లులు ఆమోదం పొందగా.. వీటిని రాజ్ భవన్ కు పంపారు. అయితే ఇందులోని ఒక బిల్లుపై మాత్రం గవర్నర్ సంతకం చేయగా చట్టంగా మారింది. మరో ఏడు బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్నాయి. నెలరోజులు గడిచినా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోద ముద్ర వేయలేదని తెలుస్తోంది. దీంతో వాటి అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి కూడా గతంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణమా అన్న చర్చ కూడా నడుస్తోంది.
అయితే గవర్నర్ల వ్యవహరం ఒక్క తెలంగాలోనే కాదు... బీజేపీయేతర రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ గవర్నర్లపై ఆయా ప్రభుత్వాలు విమర్శలు చేస్తున్నాయి. శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయటం లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ గవర్నర్ కూడా సంబంధిత బిల్లులపై సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నారా..? అనే వాదన తెరపైకి వస్తోంది.
ఆమోదం పొందాల్సినవి ఇవే....
తెలంగాణ శాసనసభ, మండలిలో ఎనిమిది బిల్లులు ఆమోదం పొందాయి.అందులో రెండు కొత్తవి ఉన్నాయి. మిగతా 6 చట్ట సవరణకు సంబంధించినవి ఉన్నాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటి ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ఎనిమిది బిల్లులకుగాను ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోదం లభించింది. మిగిలిన 7 బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
ఈ అంశంపై ఓ అధికారి స్పందిస్తూ... “అసెంబ్లీలో ఆమోదం పొందిన మరుసటి రోజే గవర్నర్ ఆమోదం కోసం సంబంధిత బిల్లులు రాజ్‌భవన్‌కు పంపిచబడ్డాయి. సాధారణంగా వారం రోజుల్లో గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె GST చట్ట సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసింది. మిగిలిన 7 బిల్లులను పెండింగ్ లోనే ఉంచారని" తెలిపారు.
ఇక రాజ్ భవన్ కు చెందిన సీనియర్ అధికారిని సంప్రదించగా... బిల్లుల ఆమోదంలో కాస్త జాప్యం జరిగిందని పేర్కొన్నారు. అయితే... ప్రతి ఫైల్ ను నిశితంగా పరిశీలించిన తర్వాతే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లోని సీనియర్ అధికారిని సంప్రదించినప్పుడు, గవర్నర్ బిల్లుల ఆమోదంలో జాప్యం చేయడంపై అజ్ఞానం ప్రదర్శించారు. అయితే, గవర్నర్ తగిన నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఫైల్‌ను పరిశీలిస్తారని చెప్పారు. బిల్లులకు ఆమోదముద్ర వేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని.. ఫలితంగా భవిష్యత్తుల్లో ఎటువంటి చట్టపరమైన సమస్యలు ఉండవని అధికారి తెలిపారు.
రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లుల్లో కీలకమైనది వర్శిటీల్లో నియమాకాలకు సంబంధించనది. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేస్తే... సంబంధిత ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుందని.. లేకపోతే జాప్యం జరిగే అవకాశం ఉందని మరో అధికారి తెలిపారు.
బీజేపీ నేత కావటంతోనే - మండలి ఛైర్మన్
ఇక ఇదే అంశంపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బీజేపీ నేత కావడంతోనే బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని కామెంట్స్ చేశారు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు.
మొత్తంగా బిల్లులు పెండింగ్ అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్న చర్చ మొదలైంది. ఇక ఇదే అంశంపై ప్రభుత్వంలోని పెద్దలు ఎలా స్పందిస్తారు..? మరోసారి గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పిస్తారా..? లేక అంతలోనే ఆమోదముద్ర పడుతుందా అనేది చూడాలి..!
టాపిక్