Tamilisai Comments On KCR : ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సెన్సేషనల్ కామెంట్స్
Governor Tamilisai Soundararajan : తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కార్యాలయం అవమానానికి గురైందని తమిళి సై మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాలని తనకు ఉందని చెప్పారు.
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లు పూర్తయి నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం జరగింది. ఇందులో గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జెండాను ఎగురవేసేందుకు అనుమతించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందని అన్నారు.
ఒక మహిళా గవర్నర్‌పై ఎలాంటి వివక్ష చూపారో రాష్ట్రం చరిత్ర లిఖిస్తుందని తమిళిసై వ్యాఖ్యానించారు. గవర్నర్ స్థానానికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై మండిపడ్డారు. మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం స్పందించలేదని గుర్తుచేసుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లినట్టు తెలిపారు. ప్రజల్ని కలవాలంటే కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి కూడా రాలేదని గుర్తు చేశారు. సమాచారం కూడా అందించలేదన్నారు. ఇలాంటివి ఇష్యూ చేయాలని లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
'ఇటీవల దక్షిణ జోనల్ సమావేశం జరిగింది. నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా దానికి హాజరయ్యాను. ఆ సమావేశంలో 75 శాతం సమస్యలు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ముఖ్యమంత్రులందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు మీరు (కేసీఆర్) ఎందుకు హాజరు కాలేదు? సమస్య పరిష్కారానికి కేంద్ర హోంమంత్రి ఉన్నప్పుడు, మీకు సమస్య ఏమిటి? మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.' అని గవర్నర్ అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి నిజంగా అధ్వాన్నంగా ఉందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. తమ పనిని నిర్వహిస్తుంటే.. అందుబాటులో ఉంటే ప్రజలు తన వద్దకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తాను జిల్లాల్లో పర్యటించినప్పుడు ఎస్పీలు, కలెక్టర్లు వస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. ఎవరి నుంచి సూచనలు తీసుకుంటున్నారో, రాలేకపోతున్నారో తెలియదు. వాళ్ళు రాకపోయినా పర్వాలేదని తమిళిసై వ్యాఖ్యానించారు.
నేను కొన్ని సమస్యలను ఎత్తి చూపాను. ప్రభుత్వానికి తెలియజేశాను. వారు తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. నా ఉద్దేశం ప్రజలకు సహాయం చేయడమే. అంతా ప్రజాసేవ కోసమే. నేను నిర్వహించే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధి హాజరు కానప్పుడు.. కనీసం మాకు తెలియజేయాలి. సరైన ప్రోటోకాల్ పాటించాలి. ఈ విషయాలు తెలంగాణ చరిత్రలో లిఖించబడతాయి.
- గవర్నర్ తమిళిసై
రిపబ్లిక్ డే వేడుకల గురించి కూడా గవర్నర్ తమిళిసై ప్రస్తావించారు. శాసనసభలో తన ప్రసంగాన్ని పక్కన పెట్టేశారన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే మాట్లాడుకోవాలని సూచించారు. కౌశిక్ రెడ్డికి సేవా రంగం వర్తించదని, ఎమ్మెల్సీగా ఆయన పేరును తిరస్కరించానని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా తాను వ్యవహరించలేనని అని తమిళిసై స్పష్టం చేశారు. ఎన్నో యూనివర్సిటీలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను గుర్తించామని, వాటిని పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు ఎన్నో లేఖలు రాశామన్నారు. వరద సంభవించినప్పుడు ప్రత్యక్షంగా వెళ్లి బాధితులను పరామర్శించానని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనుందని గవర్నర్ తమిళిసై అన్నారు.