Maharashtra crisis: ఉద్ధవ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశం కనిపిస్తోంది. బల పరీక్షకు ముందే ఉద్ధవ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తదుపరి సీఎంగా ఫడ్నవీస్ కుర్చీ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెర పడినట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బలపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్దిసేపట్లోనే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీంతో గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. ఫలితంగా శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే వర్గీయులు తిరుగుబాటుతో చోటుచేసుకున్న ఉత్కంఠ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోయినట్లు అయింది.
జోష్ లో బీజేపీ….
మరోవైపు బీజేపీ క్యాంప్ జోష్ లో ఉంది. ఉద్ధవ్ రాజీనామా ప్రకటించిన క్షణాల్లోనే సంబరాల్లో మునిగిపోయింది. ముంబైలోని ఓ హోటల్ లో పార్టీ నేతలతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన... గురువారం అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ ముంబయి రావద్దని... ప్రమాణ స్వీకారం రోజే ముంబయి రావాలని వారికి సూచించారు.
సీఎంగా ఫడ్నవీస్...?
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఎన్నికయ్యే అవకాశం ఉండగా... డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండేకు దక్కనున్నట్లు తెలుస్తోంది. షిండే వర్గంలోని 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు బయటికి వస్తున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 కాగా.. ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు ఉన్నారు. తమ వర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని మొత్తం 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే పేర్కొంటున్న విషయం తెలిసిందే. షిండే శిబిరంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో చివరకు ఉద్దవ్ రాజీనామా చేయక తప్పలేదు.
ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ఎలాంటి ప్రకటన చేస్తుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. ఇక షిండే ఆధ్వర్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు… మహారాష్ట్రకు ఎప్పుడు రానున్నారు..? ఏం జరగనుందన్న చర్చ నడుస్తోంది.