CM KCR : ముందస్తు లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు... సీఎం కేసీఆర్-cm kcr gives clarity on telangana assembly elections says polls will be held as per schedule ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : ముందస్తు లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు... సీఎం కేసీఆర్

CM KCR : ముందస్తు లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు... సీఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 06:13 PM IST

CM KCR : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నేతలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ మేరకు... బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్.

బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్

CM KCR : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారానికి ... ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. అలాంటి అవకాశమే లేదని.. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయని పేర్కొంటూ... నేతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేరకు... బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ప్రధానంగా డిసెంబర్ లోపు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన అంశంలో పార్టీ నేతలను సిద్ధం చేసే దిశగా సన్నాహక సమావేశం జరిగింది.

ఎన్నికలకు నేతలందా సిద్ధంగా ఉండాలని... వీలైనంత ఎక్కువగా ప్రజా క్షేత్రంలో ఉండాలని దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేస్తుందని.... ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. పార్టీ పరిస్థితి కూడా చాలా బాగుందని.. సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేతలందరూ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రత్యేకించి పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను కూడా సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. గృహలక్ష్మీ పథకం కింద ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని వివరించారు. ఈ పథకంతో పాటు దళిత బంధు, గొర్రెల పంపిణీ స్కీములల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు.

పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలనూ నేతలకు వివరించిన సీఎం కేసీఆర్... త్వరలోనే వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏటా ప్లీనరీ నిర్వహించే వారు. అయితే ఇటీవల పార్టీ పేరుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో... ఇక నుంచి అదే రోజు బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలకు గులాబీ బాస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా... ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని కీలక అంశాలపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో... ఈ అంశంపైనా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ సర్కార్... ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతోందని... బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరించాలని సూచించినట్లు సమాచారం. అలాగే... ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మొదటి నుంచి ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Whats_app_banner