TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు-rythu bharosa good news for telangana farmers as funds to be released soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Raithu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

HT Telugu Desk HT Telugu
Published Nov 29, 2024 07:05 AM IST

TG Raithu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని, రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం నల్గొండ జిల్లా కేంద్రంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫొటో)
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫొటో) (Photo From Komatireddy Venkat Reddy FB)

TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతుల ఖాతాల్లో త్వరలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. డిసెంబర్ 7వతేదీన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు , నల్గొండ మెడికల్ కళాశాల భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి కోమటిరెడ్డి నల్గొండ లో పర్యటించారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ ను ఇప్పటికే నీటితో నింపారు. ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు ఆయకట్టు పెరుగుతోందని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల వాంఛ నెరబొరబోతుందని మంత్రి అన్నారు.

రైతు రుణమాఫీని కూడా పూర్తిస్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నల్గొండ పట్టణంలో రూ.110 కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు పలు అభివృద్ధి పనులు, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన, రూ.275 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవన ప్రారంభోత్సవం జరగనుంది. రూ.100 కోట్లతో లతీఫ్ షాప్ దర్గా, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్డులకు శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీని ప్రకటించి చెబుతానని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

మూసీతో జిల్లాకు ఎంతో నష్టం

మూసితో ఎక్కువ నష్టపోయేది, అనారోగ్యం పాలయ్యేది నల్లగొండ జిల్లా ప్రజలేనని అన్నారు. మూసి ప్రక్షాళనతో న్యాయం జరుగుతుందన్నారు. ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గానికి సంబంధించి రెండు మిషన్లు త్వరలో జిల్లాకు చేరుకుంటాయని, 20 నెలల్లోనే సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని అన్నారు. దీంతో ఎంఆర్పితో పని లేకుండా నీళ్లు వస్తాయని తెలిపారు.

రూ.500 కు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

దేశంలో ఎక్కడలేని విధంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

నెలకు రూ.300 కోట్లను భరిస్తూ మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు బిజెపి అధికారాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు. దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు.

కెసిఆర్ తెలంగాణను అప్పులపాలు చేయగా వాటిని భరిస్తూ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుంటే మోడీ విమర్శించడం శోచనీయమన్నారు . రూ. 30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు రూ .30 వేల కోట్లతో చేపట్టబోయే రీజినల్ రింగ్ రోడ్డు శంకుస్థాపనకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీలను కూడా కలిసి ఆహ్వానిస్తసమని తెలిపారు. నల్గొండ రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

కేటీఆర్‌ది నా స్థాయి కాదు

బిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెబితే వారు మాట్లాడితే తాను సమాధానం చెప్తానని, ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్ లో పండుకున్నాడని విమర్శించారు. అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్ గురుకులాల గురించి మాట్లాడితే తాను సమాధానం చెప్పనని, వాళ్లు తన స్థాయి కాదన్నారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి మాట్లాడాలని అన్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner