Khammam School: ఆ సర్కారు స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి.. ఏడాది నిర్వహణ ఖర్చు రూ.12.84 లక్షలు.!
Khammam School: ఆ స్టూడెంట్ చాలా స్పెషలండోయ్! ఎందుకో తెలుసా? ఆ విద్యార్థిని చదివేది ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతే అయినా లక్షల ధనం ఖర్చవుతోంది. ఆ పాప కోసం సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.12.84 లక్షలు! అదేంటి ప్రభుత్వ పాఠశాల కదా.. లక్షల్లో ఖర్చు ఏంటనుకోకుండా ఈ స్టోరీ చదవండి.
Khammam School: ఒకే ఒక్క విద్యార్ధిని చదువుతున్న పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.12.84లక్షలు ఖర్చు చేస్తోంది. ఉన్న ఒక్క విద్యార్ధి కోసం ఏడాదికి సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలోకి కనిపించే విచిత్ర పరిస్థితి ఇది. ఆ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతిలో ఒకే ఒక్క విద్యార్థిని విద్యను అభ్యసిస్తోంది.
ఆ పాప కోసం ఒక టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. మధ్యాహ్న భోజనం వండి వార్చేందుకు ఒక వంట మనిషి ఉండగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం మరో కార్మికురాలు పని చేస్తోంది. వీరి జీత భత్యాల కోసం ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.12.84 లక్షలు ఖర్చు చేస్తోంది.
వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నడుస్తోంది. ఈ పాఠశాల చాలా ఏళ్లుగా నడుస్తున్నప్పటికీ ప్రయివేటు పాఠశాలల ధాటికి విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. తాజాగా స్కూల్ మొత్తంగా ఒకే ఒక్క విద్యార్థిని ఉండటం గమనార్హం. కీర్తన అనే ఒకే ఒక్క విద్యార్థిని ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది.
ఒకే స్టూడెంట్ ఉన్న ఈ స్కూల్లో ఒక టీచర్ పని చేస్తుండగా ఆమె నెలకు రూ.లక్షపైనే వేతనం పొందుతోంది. దీంతో ఆ టీచర్ జీతం రూపంలో ఏడాదికి ప్రభుత్వం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. అలాగే వంట మనిషి, పారిశుధ్య కార్మికురాలు ఒక్కొక్కరికి నెలకు రూ.3వేల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మరో రూ.60 వేల వేతనం చెల్లిస్తోంది.
ఒక్కరి కోసమే మధ్యాహ్న భోజనం వండుతున్నప్పటికీ అందుకు రూ.5000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో రూ.5000 ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నాయి. ఇవన్నీ వెరసి ఆ ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం ఒక విద్యా సంవత్సరంలో సుమారు రూ.12.84 లక్షలను ఖర్చు చేస్తోంది.
భిన్న వాదనలు..
నారపనేనిపల్లి గ్రామంలో ఒకే విద్యార్థిని చదువుతున్న వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క విద్యార్థిని చదువు కోసం రూ.12.84 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయటం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది విచిత్ర పరిస్థితి అయినప్పటికీ అనివార్యమేనని మరికొందరు వాదిస్తున్నారు. చైనాలో ఒకే ఒక్క విద్యార్థిని కోసం అక్కడి ప్రభుత్వం రైలునే నడుపుతోందని, నారపనేనిపల్లి పాఠశాలలో ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తే తప్పేంటని అంటున్నారు.
కాగా కీర్తన తల్లిదండ్రులు మాత్రం మా పాపను సర్కారు బడికే పంపుతామని నొక్కి చెబుతున్నారు. దీంతో ఆ పాఠశాలను ఎత్తేసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఆ గ్రామంలో మిగతా తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను దగ్గరలో ఉన్న వైరా, తల్లాడలోని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్న కారణంగా ప్రభుత్వ పాఠశాలలో క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి తాజా పరిస్థితి నెలకొంది.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)