Kazipet Coach Factory: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర-a dream fulfilled coach factory to be built in kazipet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kazipet Coach Factory: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర

Kazipet Coach Factory: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర

HT Telugu Desk HT Telugu
Nov 29, 2024 08:57 AM IST

Kazipet Coach Factory: ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలకమైన కాజీపేట జంక్షన్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చర్ యూనిట్‌ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రెడ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంఅమోదం
కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంఅమోదం

Kazipet Coach Factory: దశాబ్దాల డిమాండ్‌ నెరవేరుతోంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత వ్యాగన్ మాన్యూఫ్యాక్చర్‌ యూనిట్‌‌ను కోచ్‌ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

1969 నుంచే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 55 ఏళ్ల ఉద్యమ కల సాకారమైంది. దీంతో ఓరుగల్లు ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

55 ఏళ్ల నిరీక్షణ

ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని కలిపే కీలక జంక్షన్ గా కాజీపేట జంక్షన్ కు పేరుంది. నార్త్ ఇండియా లోని రాష్ట్రాలకు వెళ్లాలన్నా, దక్షిణ భారత్ లోని రాష్ట్రాలకు పోవాలన్నా కాజీపేట జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన ఈ జంక్షన్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే డిమాండ్ 1969 తెలంగాణ ఉద్యమం నుంచే ఉంది.

అప్పటి నుంచే సౌత్ సెంట్రల్ రైల్వే కు కావాల్సిన ప్యాసింజర్ కోచ్ లను పెరాంబుదూరు నుంచి తెప్పించుకుంటుండగా.. కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ పెడితే అన్ని విధాలా మేలు జరుగుతుందని ఇక్కడి రైల్వే కార్మికులతో పాటు నేతలు కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ వివిధ కారణాల వల్ల అది కాస్త కలగానే మిగులుతు వచ్చింది.

విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ

కాజీపేట కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉండగ.. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. కాజీపేట మండలం అయోధ్యపురంలో దానిని ఏర్పాటు చేసేందుకు భూములు కూడా పరిశీలించారు. భూసేకరణ ప్రక్రియలో దాదాపు రెండేండ్లు గడిచిపోగా.. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం పంజాబ్ లో సిక్కుల ఊచకోత కారణంగా అక్కడ వ్యతిరేకతను తగ్గించేందుకు కోచ్ ఫ్యాక్టరీని అప్పట్లోనే కపుర్తలాకు తరలించారు.

ఆ తరువాత ఇక్కడి ప్రజల డిమాండ్ నేపథ్యంలో 2007లో మరోసారి కేంద్రం వ్యాగన్ వీల్ వర్క్ షాప్ ను ప్రకటించింది. కానీ ఆ తరువాత వివిధ రాజకీయ కారణాల వల్ల దానిని కర్నాటకకు తరలించారు. దీంతోనే దశాబ్ధాల కాలం నుంచి పోరాటం సాగిస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని విభజన హామీల్లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం -2014 లోని 13 వ షెడ్యూల్ ఐటెం నెంబరు 10 తెలంగాణలోని కాజిపేటలో ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని ఫీజిబిలిటీని బట్టి స్టడీ చేస్తుందని పేర్కొంది. కానీ ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ అంశం తెర వెనక్కి వెళ్లింది.

నెరవేరిన ఓరుగల్లు ప్రజల కల

రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పక్కన పెట్టీ 2016లో కాజీపేటకు రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మంజూరు చేసింది. దానికి 160 ఎకరాల భూమి అవసరం కాగా.. సరిపడా స్థలం అప్పగించడంలో బీఆర్ఎస్ సర్కారు దాదాపు 8 ఏండ్లు తాత్సారం చేసింది. చివరకు ల్యాండ్ ఇవ్వగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 జూన్ లో వరంగల్ నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పీవోహెచ్ పనులతో పాటు ఇక్కడే వ్యాగన్ మ్యానుఫాక్షరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు శంకుస్థాపన చేశారు. దీంతో దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

కాగా కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి పేరున ఉద్యమాలు నడుస్తుండగా, పార్టీలకు అతీతంగా అంతా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం, ఇక్కడి ఎంపీ లు కూడా పలుమార్లు కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎట్టకేలకు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ గా అప్ గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఓరుగల్లు ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

రైల్వే ఉద్యోగ సంఘాల నేతలు, కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి సభ్యులు, పార్టీలకు అతీతంగా నేతలు కూడా సంబరాలకు రెడీ అవుతున్నారు. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఐతే వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner