Rohit Sharma: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిల్చొని ఆ టీమ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-rohit sharma speech in australia parliament india vs australia second test border gavaskar trophy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిల్చొని ఆ టీమ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిల్చొని ఆ టీమ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Hari Prasad S HT Telugu
Nov 29, 2024 07:42 AM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పార్లమెంట్ లో మాట్లాడాడు. ఈ మధ్యే పెర్త్ లో సాధించిన విజయాన్ని ఈ సందర్బంగా అతడు ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా జట్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు రెండు దేశాల మధ్య ఉన్న క్రికెట్ సంబంధాల గురించి ప్రసంగించాడు.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిల్చొని ఆ టీమ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిల్చొని ఆ టీమ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (X/BCCI)

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా కెప్టెన్.. అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించడం గమనార్హం. గురువారం (నవంబర్ 28) ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రోహిత్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ ఫీల్డ్ లోపల, బయట విడదీయలేని స్నేహం ఉందని ఈ సందర్భంగా అతడు అన్నాడు.

ఇక్కడ క్రికెట్ ఆడటం ఎంజాయ్ చేస్తాం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలాంటివి ఆడే సమయంలో ఫీల్డ్ లో రెండు క్రికెట్ టీమ్స్ మధ్య ఉద్రక్తంగా సాగే వైరం రెండు దేశాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంచుతుందని రోహిత్ అన్నాడు. "స్పోర్ట్స్, వాణిజ్యంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సుదీర్ఘ బంధం ఉంది. ఇక్కడ క్రికెట్ ఆడటాన్ని ఎంజాయ్ చేస్తాం.

ఇక్కడి ఫ్యాన్స్ లో క్రికెట్ పట్ల ఉండే ప్యాషన్, ప్లేయర్స్ లో ఉండే పోటీతత్వం వల్ల ఆస్ట్రేలియా ఓ ఛాలెంజింగ్ టీమ్ అవుతుంది. ప్రపంచంలోని బెస్ట్ టీమ్స్ లో ఒకటైన ఆస్ట్రేలియాతో ఆడటం బాగుంటుంది" అని రోహిత్ అన్నాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటమే కాదు.. ఇక్కడి నగరాల్లో విహరించడం, వాళ్ల సంస్కృతి కూడా చాలా బాగుంటుందని రోహిత్ చెప్పాడు.

ఆస్ట్రేలియాలో సక్సెస్ సాధించాం

ఆస్ట్రేలియాలో గతంలో సాధించిన సక్సెస్ తోపాటు ఈ మధ్యే పెర్త్ లో తొలి టెస్టు విజయాన్ని కూడా రోహిత్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. "ఆస్ట్రేలియాలో మేం విజయవంతమయ్యాం. ఈ మధ్యే ఓ టెస్టు మ్యాచ్ గెలిచాం. ఈ జోరును కొనసాగించాలని అనుకుంటున్నాం.

ఇక్కడి సంస్కృతినీ ఆస్వాదించాలని అనుకుంటున్నాం. మిగిలిన మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియన్, ఇండియన్ ఫ్యాన్స్ ను అలరిస్తామని భావిస్తున్నాను. మంచి క్రికెట్ ఆడటంతోపాటు దేశ పర్యటననూ ఆస్వాదిస్తాం. వచ్చే కొన్ని వారాల్లో మంచి క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నాను. మమ్మల్ని పార్లమెంట్ లోకి ఆహ్వానించిందుకు కృతజ్ఞతలు" అని రోహిత్ అన్నాడు.

రోహిత్ వచ్చేశాడు

ఈ మధ్యే మరో బిడ్డకు తండ్రి అయిన రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలుసు కదా. ఇప్పుడతడు రెండో టెస్టుకు తిరిగి వచ్చాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లో డేనైట్ టెస్ట్ సవాలుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. రోహిత్ రాక జట్టు బలాన్ని పెంచుతోంది.

ఆ టెస్టుకు ముందు కాన్‌బెరాలో శనివారం (నవంబర్ 30) నుంచి ఓ పింక్ బాల్ వామప్ మ్యాచ్ ఆడనుంది. ఆ డేనైట్ టెస్టుకు ముందు ఈ మ్యాచ్ మంచి ప్రాక్టీస్ కానుంది. అయితే రోహిత్ తిరిగి రావడంతో తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. అతనితోపాటు శుభ్‌మన్ గిల్ కూడా వస్తే.. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ లాంటి వాళ్లు తప్పుకోవాల్సి వస్తుంది.

ఇక ఓపెనర్లు తొలి టెస్టులో సక్సెసైన యశస్వి, రాహుల్ లను అదే స్థానాల్లో కొనసాగిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. రోహిత్ ఓపెనింగ్ చేసి, గిల్ తిరిగి వస్తే రాహుల్ మళ్లీ మిడిలార్డర్ కు మారాల్సి వస్తుంది.

Whats_app_banner