Supreme Court: సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై విచారణకు సుప్రీం అంగీకారం
Supreme Court: విపక్ష పార్టీలపై వివక్షాపూరితంగా సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
Supreme Court: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ (Central Bureau of Investigation CBI), ఈడీ (Enforcement Directorate ED) లను ప్రతిపక్ష నేతలపై దురుద్ధేశ పూరితంగా ప్రయోగిస్తోందని కేంద్రంపై కాంగ్రెస్ నాయకత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాయి. ఆ పిటిషన్ పై విచారణ జరపడానికి శుక్రవారం సుప్రీంకోర్టు అంగీకరించింది.
Supreme Court: 95% ప్రతిపక్ష నేతలపైననే..
విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ (CBI), ఈడీ (ED) దర్యాప్తు జరుపుతున్న కేసుల్లో 95 % వివిధ ప్రతిపక్ష నేతలపైననే ఉన్నాయని ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ (CJI Justice Chandrachud) ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులు ఎదుర్కొంటున్న ఎవరైనా విపక్ష నేతలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరితే, వారిపై ఉన్న కేసులు మాయమైపోతున్నాయని, వారిపై సీబీఐ (CBI), ఈడీ (ED) దర్యాప్తులు నిలిచిపోతున్నాయన్నారు. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం, వారిని తమ పార్టీలో చేర్చుకోవడం కోసం బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్రం ఈ సీబీఐ (CBI), ఈడీ (ED) లను దుర్వినియగం చేస్తోందన్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ ముందు, అరెస్ట్ తరువాత అనుసరించాల్సిన నిబంధనలను, వాటి అమలు తీరును తెలియజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్యంపై దాడిగా విపక్ష పార్టీలు భావిస్తున్నాయని కోర్టుకు వివరించారు. విపక్ష పార్టీల వాదనను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖండించారు.
Supreme Court: ఏప్రిల్ 5 కి వాయిదా..
ప్రాథమిక వాదనల అనంతరం ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 5వ తేదీన జరుగుతుందని ప్రకటించింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసిన పార్టీల్లో కాంగ్రెస్ (congress), బీఆర్ఎస్ (BRS), డీఎంకే (DMK), ఆర్జేడీ (RJD), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఎన్సీపీ (NCP), శివసేన (ఉద్ధవ్ వర్గం), జేఎంఎం (JMM), జేడీయూ (JDU), సీపీఐ (CPI), సీపీఎం (CPM), సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) లున్నాయి.