తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak: పేపర్‌ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేయనున్న ఈడీ

TSPSC Paper Leak: పేపర్‌ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేయనున్న ఈడీ

HT Telugu Desk HT Telugu

31 March 2023, 11:06 IST

  • TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేయాలని యోచిస్తోంది. లక్షల రుపాయలు చేతులు మారిన వ్యవహారంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్‌ చట్టం కింద దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు.

పేపర్‌ లీక్ వ్యవహారంపై కేసు నమోదు చేయనున్న ఈడీ
పేపర్‌ లీక్ వ్యవహారంపై కేసు నమోదు చేయనున్న ఈడీ (HT_PRINT)

పేపర్‌ లీక్ వ్యవహారంపై కేసు నమోదు చేయనున్న ఈడీ

TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పే పర్ లీక్ వ్యవహారంలో లక్షల రుపాయలు చేతులు మారడంతో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయనే అంశంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. పేపర్ లీక్ వ్యవహారంపై ఇప్పటికే విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు లక్షల రుపాయల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

టిఎస్‌పిఎస్సీ వ్యవహారంలో నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడంతోఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగబోతోంది.అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో ఈడీ కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

పేపర్‌ లీక్ వ్యవహారంపై మొదట బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను కూడా విచారించారు. చాలా రోజులుగా పరీక్షలకు సిద్దపడుతున్న వారిని గుర్తించి వదిలేశారు. బేగంబజార్‌ పిఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుంది.

వెలుగు చూసిన అక్రమ నగదు లావాదేవీలు….

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌‌తో పాటు పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ దర్యాప్తు చేస్తోంది. కమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు వాటిని లీక్‌ చేసి అమ్ముకున్నారు. సిట్‌ చేపట్టిన దర్యాప్తులో పలు ఆధారాలు లభించాయి. టీఎస్‌పీఎస్సీ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు వెల్లడైంది.

ప్రశ్నాపత్రాల అమ్మకాల లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కమిషన్‌ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌, తన స్నేహితురాలు రేణుకకు ఏఈ ప్రశ్నపత్రం ఇచ్చి రూ.10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌లు ఈ పేపర్‌ను మరో అయిదుగురికి అమ్మి దాదాపు రూ.25 లక్షల వరకూ వసూలు చేశారు. మరికొందరికి కూడా ప్రశ్నపత్రం అమ్మి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రానికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చు కున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోందని చెబుతున్నారు. సిట్‌ నుంచి లేదంటే న్యాయస్థానం నుంచి గానీ ఎఫ్‌ఐఆర్‌ పొంది.. శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన నిందితులను ఈడీ అధికారులు మరో మారు విచారించడానికి, అవసరమైతే అరెస్టు చేయడానికీ అవకాశం ఉంది.