BRS : నేడు మహారాష్ట్రలో లక్ష మందితో BRS సభ... కేసీఆర్ ప్లాన్ ఇదేనా..?
26 March 2023, 9:34 IST
జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కాందార్ లోహాలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
కేసీఆర్
BRS Public Meeting in Kandar Loha : తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేలా పక్కాగా పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలు పార్టీలోకి రావటం.. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించటంతో పాటు త్వరలోనే సభకు రెడీ అవుతున్నారు. ఇదేకాకుందా మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన కేసీఆర్... నాందేడ్ వేదికగా సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ఆదివారం(మార్చి 26) మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు కేసీఆర్. పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన రెండో సభకు కూడా హాజరుకానున్నారు.
కాందార్ లోహాలో భారీ సభ....
మహారాష్ట్ర కాందార్ లోహాలోని బైల్ బజార్‌లో జరిగే ఈ సభను తలపెట్టారు. ఏకంగా లక్ష మంది దాకా వస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 15 ఎకరాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు . ఇంత భారీ సభను ఏర్పాటు చేయటంతో పాటు, పార్టీ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది అత్యంత ఆసక్తికిని రేపుతోంది. ఇక సభలో భారీ వీడియో స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.
ప్లాన్ ఇదేనా….
త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో పోటీ చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తలపెట్టిన ఈ సభ ద్వారా… స్పష్టమైన సంకేతాలు ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ మోడల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఇక్కడ చేపట్టిన కాళేశ్వరం, రైతుబంధు, రైతుభీమాతో పాటు మరిన్ని పథకాలను ప్రధానంగా ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. గత నెల 5వ తేదీన నాందేడ్ కేంద్రంగా సభను నిర్వహించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ టూర్….
ఇవాళ ఉదయం 12.30 సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బహిరంగ సభ కాంధార్ లోహకు చేరుకుని బస్సులో సభా స్థలికి చేరుకోనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్ ద్వారా నాందేడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 కంటే ముందే నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.