తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Government To Take Up Teachers Transfers And Promotions From January 27

Teachers Transfers Promotions : జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

HT Telugu Desk HT Telugu

20 January 2023, 20:36 IST

    • Teachers Transfers Promotions : తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై మరింత స్పష్టత వచ్చింది. జనవరి 27 నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. 
జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు
జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు (facebook)

జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

Teachers Transfers Promotions : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. జనవరి 27 నుంచి టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... జనవరి 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. పూర్తి షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని ... ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తేదీలు ఖరారు చేయడంతో.. విధి విధానాలు ఎలా ఉంటాయని ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Near National Park : హైదరాబాద్ కు 20 కి.మీ దూరంలో నేషనల్ పార్క్, ఈ సమ్మర్ లో ఓ ట్రిప్ వేయండి!

Nallamala Saleshwaram : తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర - నల్లమల లోయలోని ‘సళేశ్వరుడి’ని చూసొద్దామా..!

TSRTC Buses : విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ - ప్రతి 10 నిమిషాలకో TSRTC బస్సు, డిస్కౌంట్ ఆఫర్ కూడా..!

IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ - నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే

ఫిబ్రవరి రెండో వారానికల్లా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రక్రియ జరిగేలా జాగ్రత్తలు తీసుకోనుంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం, ఇతర తరగతుల పరీక్షలు త్వరలో జరగనున్నందున.. ప్రస్తుతానికి బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసినా.. వచ్చే విద్యా సంవత్సరంలోనే రిలీవ్ అవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

2018 జూలైలో ప్రభుత్వం టీచర్ల బదిలీలు చేపట్టింది. ఆ తర్వాత ఉపాధ్యాయులు ట్రాన్సఫర్స్, ప్రమోషన్స్ కోసం అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినతులపై ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చిన సర్కార్... నాలుగున్నరేళ్ల తర్వాత బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది ఉపాధ్యాయులు అర్హత సాధిస్తారు. ఇదివరకున్న నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ట్రాన్సఫర్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడవుతాడు. నిబంధనల ప్రకారం... ఉపాధ్యాయుడు 8 ఏళ్లు.. ప్రధానోపాధ్యాయుడు ఐదేళ్లకు మించి ఒకే చోట పనిచేయకూడదు. ఇలాంటి గరిష్ట సర్వీసుని పరిగణలోకి తీసుకొని బదిలీలు చేపడతారు.

కొత్త జిల్లాలకు అనుగుణంగా సర్కార్ ఉద్యోగులను కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీచర్లను కూడా బదిలీ చేశారు. సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చేలా ప్రక్రియ చేపట్టారు. ఈ విధానం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు దూరమయ్యారు. ఉపాధ్యాయులుగా ఉన్న భార్యా భర్తలను చెరో జిల్లాకు కేటాయించారు. అ అంశం కూడా పెద్ద గందరగోళమే సృష్టించింది. ఇక కేటాయింపు ప్రక్రియలో సరైన విధానాలు అవలంబించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో... ప్రక్రియ ఎలా సాగుతందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టక ఏడున్నరేళ్లు అవుతోంది. తాజాగా చేపట్టనున్న ఈ ప్రక్రియ ద్వారా... విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా.. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పించనున్నారు. తద్వారా దాదాపు 11 వేల మంది ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.